– కంది శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తు దసరా వేడుకల్లో పట్టణ ప్రథమ పౌరుడు, చైర్మెన్ జోగు ప్రేమేందర్ తో పాటు మాజీ మంత్రి జోగురామన్న, తనను ఆహ్వానించకపోవడం సరైంది కాదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజాసేవ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకలకు ఉత్సవ సమితి నాయకులు ఎమ్మెల్యే మాటలు విని మున్సిపల్ చైర్మెన్ తో పాటు మాజీమంత్రి జోగు రామన్న, తనను ఆహ్వానించలేదని ఆరోపించారు. ఎవరి అండతో గెలిచారో అదే మున్నూరు కాపు బిడ్డలను విస్మరించి ద్రోహిగా మిలిపోతున్నారన్నారు.
ఎమ్మెల్యే అయిన తరువాత 400 కోట్ల భూములకు కబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇక నుంచి తమ వైఖరిని మర్చుకోవాలని హితవు పలికారు. హిందూ ఉత్సవ వేడుకలకు పార్టీలు రాజకీయాలు పక్కన బెట్టి అందరిని కలుపుకుపోవాలన్న ధ్యాస లేదా అని ప్రశ్నించారు. దీని ద్వారా ఆదిలాబాద్ లో ఒక విష సంస్కృతికి బీజం వేస్తున్నారని ఆరోపించారు. బీసీలందరు దీన్ని గమనించాలన్నారు. పాయల్ శంకర్ స్వార్ధాన్ని ఇప్పటికైనా మాజీ మంత్రి జోగురామన్న అర్ధం చేసుకోవాలన్నారు. ఆయనతో అంటకాగుతున్నవారికి ఎప్పటికైనా ఆయన వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహించాలన్నారు. గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి రాంలీలా మైదానంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలను అడ్డుకోవడాన్ని తప్పు బట్టారు. ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని భూకబ్జాలు చేస్తూ కోట్లు గడిస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారని ఇలాంటి వారికి ఎప్పటికైనా ప్రజల నుండి వ్యతిరేకత తప్ప దన్నారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్, సంద నర్సింగ్, ఆవుల వెంకన్న, నాయకులు ఉన్నారు.
.