– టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఏపీ సీఎం జగన్ కలవకపోవడం సరైన పద్ధతి కాదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ చెప్పారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కుసంస్కారంగా మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సుధాకర్‌గౌడ్ విలేకర్లతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పొరుగు రాష్ట్ర సీఎం వచ్చినపుడు ఇక్కడి సీఎంను కలవడం పద్ధతి అని తెలిపారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి దీన్ని పాటించకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో ఉమ్మడిగా ఉన్న ఏపీ, తెలంగాణ ప్రాంతాలు మధ్య అనేక అంశాలు పెనవేసుకొని ఉన్నాయని గుర్తుచేశారు. విభజన సమస్యలు, నీటి పంపకాలు, విద్యుత్, ఉద్యోగుల అంశాలపై మాట్లాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. కానీ ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత అంశాల కోసమే వచ్చి, మిగతా వాటిని విస్మరించారని విమర్శించారు. తప్పులన్నీ వారివైపు ఉన్నప్పటికీ, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అహంభావంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ కేవలం మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అహకారంతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయారనీ, ఏపీలో వైసీపీ కూడా అదే మాదిరిగా పోవడం ఖాయమని తెలిపారు.