– అసెంబ్లీలో తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం పద్ధతి కాదు
– దేశంలో నిరంకుశ పాలన : వి శ్రీనివాసరావు
– కలెక్టరేట్ వద్ద ధర్నాతో ముగిసిన సీపీఐ(ఎం) పోరుబాట-పాదయాత్ర
ఒంగోలు : ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన అసెంబ్లీలో సమస్యలను ఎమ్మెల్యేలు గాలికి వదిలేశారని, తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం సరికాదనిసిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని తెలిపారు. దేశంలో నిరంకుశ పాలన సాగుతోందని, రాజ్యాంగ వ్యవస్థలు మోడీ కాళ్లకింద నలిగిపోతున్నాయని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట-పాదయాత్ర ముగింపు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద పాదయాత్ర బృందానికి ఆ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారని, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలకు టిడిపి ఎమ్మెల్యేలు హాజరు కావాలన్నారు. కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేటు పెట్టడం వైసిపి ప్రభుత్వానికి చేతకాలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఒంగోలు డెయిరీని గత ప్రభుత్వం మూసివేస్తే, వైసిపి ప్రభుత్వం అమూల్ సంస్థకు అప్పగించిందని దుయ్యబట్టారు. మోడీ చెబితేనే సిఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని, దీనిపై ప్రతిపక్షం మాట్లాడకపోతే వైసిపికి మేలు కలుగుతుందన్నారు. రాష్ట్ర పరువు తీసిన బిజెపి నాయకులను కలవడం కోసం ఒకరోజు సిఎం జగన్, ఇంకోరోజు నారా లోకేష్ ఢిల్లీకి పోతున్నారని, వారికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలు ఎవరు కోరారని ప్రశ్నించారు. అన్నీ తన చేతుల్లో ఉండాలనే ధోరణిలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని విమర్శించారు.