– రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు
నవతెలంగాణ-దేవరుప్పుల
ప్రస్తుత పరిస్థితుల్లో తెరవాల్సింది కాంగ్రెస్ పార్టీ గేట్లు కాదని, రైతుల పొలాలకు నీరందించే రిజర్వాయర్ల గేట్లని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టుల గేట్లు తెరిచి కాలువల ద్వారా చెరువులు నింపి, పొలాలు ఎండకుండా నీరందించి రైతాంగాన్ని అదుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా గ్రామపంచాయతీ పరిధిలో నీళ్ళు లేక ఎండిపోయిన రైతుల పంట పొలాలను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూడు నెలల నుండి నీళ్ళు లేక పండించిన పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లకోసం బోర్లు వేసి లక్షల రూపాయలు రైతులు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఈ ఊరిలోనే వందకు పైగా బోర్లు వేసి అప్పుల పాలయ్యమని రైతులు చెబుతుంటే తనకే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నదిలో నీళ్ళు ఉండి కూడా దేవాదుల ప్రాజెక్టుల నుండి రైతులకు నీళ్ళు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రూ.15000 రైతుబంధు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకూ ఇస్తామని వాళ్ళను కూడా మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 185 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతులకు కష్టాలు పెరిగాయన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి, ఉన్న వడ్లను కొని రూ.500ల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమానికి బీఆర్‌ఎస్ శ్రీకారం చుడుతుందని, రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.