– ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రవాణా రంగంలోని కార్మికులంతా ఐక్యంగా పోరాడితేనే కేంద్రంలోని నరేంద్రమోడీ మొండి ప్రభుత్వానికి బుద్ధి చెప్పగలమని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్(ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అర్థం చేసుకుని ట్రాన్స్‌పోర్టు కార్మికులంతా ఐక్యపోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే కార్మికులకు అనుకూలమైన విధానాలు అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. లేకపోతే కార్మికులపై ఆర్థిక భారాలు పెద్దఎత్తున మోపుతూ, ఆర్భాటంగా ప్రచారాలు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. కొత్త చట్టం ద్వారా చలానాలు విధిస్తూ, భారాలు మోపటానికి కేంద్రం చూస్తున్నదని విమర్శించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు, ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు రాంబాబు, జి.ఉపేందర్, కె.అజరుబాబు, సీహెచ్. లక్ష్మి నారాయణ, కోటయ్య, రాష్ట్ర కార్యదర్శి వై. విక్రమ్, పున్నం రవి, ఎస్.రాము, కోశాధికారి సతీష్, నాయకులు సత్తయ్య, ఉషన్న, రాములు, శ్రీను, సంపత్, రాందాసు, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.