రైతు పేరుతో రాజకీయం చేయడం సిగ్గుచేటు

– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవ తెలంగాణ- రామారెడ్డి:  రైతుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడం సిగ్గుచేటని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుబంధును అడ్డుకుంటుందని దుష్ప్రచారం చేయడం మానుకొని, ఎన్నికల కమిషన్ సూచించినట్లు నడుచుకోవలసిన బాధ్యత ప్రధాన రాజకీయ పార్టీలపై ఉంటుందని, డిసెంబర్ 3 తేదీ కంటే ముందు దమ్ముంటే రైతుబంధు అందించాలని, లేదంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెంచిన రైతుబంధుతో రైతులకు అందిస్తుందని పేర్కొన్నారు.  వరి వేస్తే ఉరి అని రైతులను భయభ్రాంతులకు గురిచేసింది ఎవరని? ఉచిత ఎరువులు అందిస్తానని చెప్పి రైతులను మోసం చేసింది ఎవరని? గత ఎన్నికల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి, ఎన్నికలు వస్తున్నాయని సగం మంది రైతులకు మాఫీ చేసి, సగం మంది రైతులకు మొండి చేయి చూపింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.  గతంలో ఎప్పుడో కాంగ్రెస్ నిర్మించిన కడెం ప్రాజెక్టు నిండిన నీటితో పొంగిపొర్లు తే, 1% కూడా డ్యామేజ్ కాలేదని. మొన్న బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం ప్రభుత్వ పనితనానికి నిదర్శనం. మీరు ఎంత గగ్గోలు పెట్టిన, మేడిగడ్డ పిల్లర్లు కుంగినట్లు బీఆర్ఎస్ ను ప్రజలు భూగర్భంలో కలపడం ఖాయం అని పేర్కొన్నారు.