ఇంటికన్నా గుడి పదిలం అనే సామెత ఇప్పుడు ప్రసాదాలు, దర్శనాలు ఖర్చుతో కూడుకున్నవవడంతో, చెల్లుబాటులో లేకుండా పోయింది. ఈ లోకంలో ఒకడికి నచ్చింది మరొకడికి నచ్చదు. ఒకడు మెచ్చింది మరొకడు చచ్చినా మెచ్చడు. ఇప్పుడు గుడిస్థానంలో ఎవరికి తోచింది వారు పూరించుకోవచ్చు.
నువ్వూ నేనూ అయితే గుడి స్థానాన్ని బడితో భర్తీచేస్తే చేయవచ్చును. కానీ రాజొకడున్నాడు. వాడు మాత్రం అస్సలు ఒప్పుకోడు. రాజంటే రాజు అనే పేరు పెట్టుకున్న పేదన్నమాట. కనీసం పేరు అన్నా రిచ్‌గా వుంటే పోయేదేం అని కొందరాపేరు పైసా ఖర్చులేకుండా పెట్టుకుంటారు. రాజు అనే వాడికి మాత్రం ఇంటికన్నా జైలు పదిలం అన్న మాట గూస్‌బంప్స్ అనగా బాతులు తెప్పిస్తుంది. అనేకులు అమెరికా వెళ్దాం, కెనడా పోదాం, దుబారు చూద్దాం అని సంబరపడతారేమో కానీ, రాజు కాని ఈ రాజుకు మాత్రం పగలూ రాత్రీ ఒకటే ధ్యాస. ఎప్పుడెప్పుడు జైలుకు వెళ్దామా అనేదే నిత్యజపం. ఇదేమిటీ వింత జబ్బు. ఎవడైనా ఎక్కడికైనా వెళ్తానంటాడు కానీ వీడు… ఈ రాజుగాడు జైలుకు వెళ్తానంటాడేమిటని ఎవరైనా విస్తుపోతారు, ఆశ్చర్యపడతారు, అవాక్కవుతారు. ఔరౌరా అంటారు.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటాడు రాజు. వాడి జీవిత ధ్యేయం, గమ్యం, లక్ష్యం, సర్వం జైలే. జైలుకు వెళ్లడమే. సరేనోరు రాజాధిరాజూ జైలుకే వెళ్దూగానీ… ఎందుకు వెళ్తావో, ఎలా వెళ్తావో చెప్పి వెళ్లు అని ఎవరైనా అడిగితే… అవునయ్యా జైలు అంటే నాకిష్టం, ఆ మాట వింటే చాలు నా ఒళ్లు ఉప్పొంగుతుంది, మనసు రెక్కలు విప్పి విహరిస్తుంది అంటాడు. అక్కడ ఆగడు. అసలు మీరంతా దేవుడు, మాధవుడు అని భక్తితో చెంపలు రెండూ వాయించుకుంటారే, ఆయన ఎక్కడ పుట్టాడు, జైల్లోనే కదా! జైల్లో పుట్టడం వల్లే కదా ఇంత పాపులర్ అయ్యాడు. సరే! ఆయన సంగతి వదిలేద్దాం, భారద్దేశానికి సొతంత్రం తేవడానికి ఎంతమంది కాలాపానీలో గడిపి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. జైలుకు వెళ్లినవాళ్లంతా చరిత్రలో పర్మనెంటుగా ఉండిపోయారు అని వాదిస్తాడు.
తను జైలుకు వెళ్లడం ఎందుకో ఏకబిగిన ఎన్ని గంటలైనా చెప్పగలిగే రాజుకు తన జీవితాశయం అయిన జైలు జీవితం ప్రాప్తించేది ఎలానో తెలీక అనేక రకాలుగా ఆలోచించాడు. సరాసరి ఏదైనా పోలీసు ఠాణాకు వెళ్లి ఇన్‌స్పెక్టర్ సార్ నాకు జైలుకు వెళ్లాలని ఉబలాటంగా, ఉత్సాహంగా, కోరికగా ఉంది అంటే సరిపోదు కదా.
ఏదైనా సాధించాలంటే ఏదో ఓ ఛండాలపు పనో, పనికిమాలిన పనో చేసి తీరాల్సిందే కదా అనుకున్న రాజు జనం కిటకిటలాడే ప్రదేశాల్లో రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో తిరుగాడాడు. కానీ అనుకున్నది సాధించలేకపోయాడు. తనకు తెల్సిన ఓ గురూజీ దగ్గర పర్సులు కొట్టేపని ప్రాక్టీసు చేశాడు కానీ సొంతంగా ఓ పర్సుకొట్టి, పోలీసు చేతిలో పెట్టి కుడికాలు పెట్టి జైలులో అడుగు పెట్టి తన చిరకాల వాంఛ తీర్చుకుందామనుకున్నాడు. కానీ డిజిటల్ మనీ పాపమాని ఎవ్వరి జేబుల్లోనూ పర్సులే దొరకలేదు. అందరూ గూగుల్ పేలు, ఫోన్‌పేలకు అలవాటు పడ్డారు కదా.
రాజుకు కళ్లు మూసినా తెర్చినా జైలే గుర్తుకొస్తున్నది. తనకు తెల్సినవాడొకడు జైలు జీవితం గురించి చెప్పిన కథనాలే గుర్తుకొస్తున్నయి. జైల్లో చిప్పకూడు అనే మాట పచ్చి అబద్ధమని, ముప్పూటలా మింగవచ్చని, నాలుగ్గోడల మధ్య చారల చొక్కాల ఫ్రెండ్సుతో కల్సి తిరగొచ్చని విన్నప్పటినుంచి జైలో జైలు.. జైలే జైలు అని కలవరింతలు మొదలైనవి. పర్సు దొంగతనం ఔట్‌డేటెడ్ అయిందని తాళాలు వేసున్న ఇళ్లవైపు దృష్టి మరల్చాడు మన రాజు. అక్కడా స్టార్ ఎదురైంది. జనాలు బంగారం, పెద్ద నోట్లు లాకర్లలో దాచిపెట్టి ఇళ్లల్లో కందిపప్పు, చింతపండు తప్ప మరేమీ వుంచడం లేదు. ఇలా కుదరదని షాపుల్లో పట్టపగలు దొంగతనానికి యత్నిస్తే సీసీ కెమెరాలో చూసి షాపువాళ్లు రాజును పోలీసులని పిలవండ్రా అని బతిమాలుకున్నా వినకుండా ఒళ్లు పచ్చిపుండు చేసి కారం చల్లి వదిలిపెట్టసాగారు కానీ రాజును జైలుకు పంపాలన్న మంచితనం చూపలేదు.
రాజు వుంటున్న వీధిలో ఓ ఇంట్లోకి అనేక మార్లు జైలుకు వెళ్లివచ్చిన ఓ మనిషి వచ్చి దిగాడని తెల్సి వెళ్లి దర్శనం చేసుకున్నాడు రాజు. జైలుకు వెళ్లితీరాలి దాదా, మార్గం ఉపదేశించండి అని జైలు రిటర్న్‌డ్’ని వేడుకున్నాడు.
”ఉరేరు! ఈ జైలు పిచ్చేమిట్రా నీకు. ముప్పూటలా తిండి అని ఎవరు చెప్పాడ్రా. ఒళ్లు పులిసిపోయేట్టు పన్లు చేయిస్తారు” అన్నాడు దాదా.
”ఎన్నన్నా చెప్పు, ఏమన్నా చెప్పు దాదా, చిన్న నాటి నుంచి జైలే నా ఆదర్శం, జైలే నా వైకుంఠం, జైలే నా స్వర్గసీమ” అన్నాడు రాజు.
”అయితే గియితే జైలుకే వెళ్లి తీరాలనుకుంటే రాజకీయఖైదీగా వెళ్లరా. ప్రత్యేక సదుపాయాలుంటాయి. ఇలాగ చిన్నా చితకా దొంగతనాలు చేసి ఊచలు కౌంటు చెయ్యడానికి బదులు ఏదో పార్టీలో చేరి కుంభకోణాలు, స్కాములూ, లాండరింగులూ, స్విడ్‌ప్రోకోలు చేసిపోతే సొమ్మూ, సోకూ పవరూ దక్కుతాయి” అన్నాడు జైలుపక్షి.
పర్సు దొంగతనాలకన్నా, కొంపల్లో దూరడంకన్నా షాపుల్లో సరుకులు లేపేయడం కన్నా రాజకీయం ముసుగుల్లో కోట్లు దొబ్బితిని, రెండు వేళ్లతో విక్టరీ సైను చూపిస్తూ జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లంతా రాష్ట్రాల ముఖ్యమంత్రులయ్యారు. ఆ కారణంగానేమో ఇప్పుడు లీడర్లంతా జైలుకు వెళ్తామని వుబలాట పడ్తున్నారు. నీలాగే జైలు నామం కలవరిస్తున్నారు అన్నాడు చెరసాల గురూజీ. ఇన్నాళ్లూ జైలుకు వెళ్లాలన్న కోరిక ఎందుకు పుట్టిందో నాకు ఇప్పుడు తెల్సింది అనుకుంటూ భవిష్యత్తు ముఖ్యమంత్రి అయ్యే యోగం వుందని చిలకజోష్యుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి ఉత్సాహంగా ముందుకు నడిచాడు రాజు కాని రాజు. జైలుకు వెళ్లి రాజవ్వాలనుకుంటున్న రాజు.
– చింతపట్ల సుదర్శన్
9299809212