– మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని, అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మకూడదని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ చేసిన మోసాన్ని గమనించాలని, పదేండ్లు ప్రజలు పడిన ఇబ్బందులు చాలని ఆయన అన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం చేపడితే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో సహకరించిందని, తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజలు కేసీఆర్ పార్టీని నమ్మి అధికారం కట్టబెడితే వారు ఇచ్చిన మేనిఫెస్టోలలో ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసేందుకు బీఆర్‌ఎస్ నాయకులు తిరుగుతున్నారని తెలిపారు. ప్రజలు వీరి మోసాలను గమనించాలని సూచించారు. కాంగ్రెస్ పథకాలను కాపీ పేస్టు చేసి మరోసారి ప్రజలను వంచించేందుకు వస్తున్నారని వారిని నిలదీయాలని తెలిపారు. సమస్యలపై మాట్లాడిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి జైలుకు పంపిన మీలాంటి వారు మళ్ళీ గెలువకూడదని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత ఏర్పడిందని, ఇప్పుడు కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వీర్లపల్లి శంకర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రాజు, కృష్ణా రెడ్డి, చెన్నయ్య, తిరుపతి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, బాదేపల్లి సిద్దార్థ పాల్గొన్నారు.