రాజ్యాంగ విలువలను కాపాడేది కాంగ్రెస్సే

రాజ్యాంగ విలువలను కాపాడేది కాంగ్రెస్సే– జాతీయ జెండావిష్కరణలో మహేష్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాజ్యాంగ విలువలను కాపాడేది కాంగ్రెస్‌ పార్టీయేనని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ గుర్తు చేశారు. బీజేపీకి స్వతంత్ర ఉద్యమంతో సంబంధం లేదన్నారు. నెహ్రూ, రాజీవ్‌ గాంధీ చేసిన సంస్కరణలతో దేశం ముందు కు పోతున్నదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమీ లేదన్నారు. కానీ దేశానికి స్వతంత్రాన్ని తామే తెచ్చినట్టు చెబుకుంటున్నారని విమర్శించారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించుకుని ముందుకు పోవాలని కోరారు. దేశ ప్రజల కోసం రాహుల్‌ గాంధీ యాత్ర చేస్తున్నారని గుర్తు చేశారు. కుటుంబ పాలన, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, సలహాదారులు షబ్బీర్‌ అలీ, హర్కర వేణుగోపాల్‌, ఎమ్మెల్సీ వెంకట్‌, ఎమ్మెల్యేలు, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు వి. హనుమంతరావు, మల్లు రవి, మధు యాష్కీ, సీనియర్‌ నేత కోదండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అన్యాయం చేస్తుంది సినీ నటి, కాంగ్రెస్‌ నేత దివ్యవాణి
దేశంలో అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ అన్యాయం చేస్తున్నదని సినీనటి, కాంగ్రెస్‌ నేత దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. యాభై రోజుల కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు విశ్వాసం పెరిగిందన్నారు. ఉచిత బస్సుప్రయాణంతో పది కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిందన్నారు. రాజకీయ విలువలు పెంచేలా కేసీఆర్‌ అనారోగ్యంతో ఉన్నప్పుడు సీఎం వెళ్లి పరామర్శించడం మంచి సంప్రదాయమని కొనియాడారు. .ఏపీసీసీ అధ్యక్షులుగా షర్మిల నియామించడం మంచి శుభసూచికమన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో నూతన ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరముందన్నారు.