నవతెలంగాణ – గోవిందరావుపేట
8న కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అర్హులైన నిరుపేదలందరికీ కూడు గూడు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పసర గ్రామంలో గుడిసె వాసుల సమావేశం గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకట్ రెడ్డి హాజరై మాట్లాడారు. సుమారు రెండు సంవత్సరాలుగా నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని వారికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీనిని అధికారులు గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అరకొర సదుపాయాలతో గుడిసె వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ భూమిలో దారిద్య రేఖకు దిగువన ఉన్న పేదలు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి వారికి నివాస స్థలం కు హక్కు పత్రం ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత రెండు సంవత్సరాలుగా అధికారులు పదేపదే మారుతున్న సమస్యను వారికి వివరించడమే తప్ప పరిష్కారం కాలేదని అన్నారు. దీనికి సంబంధించి ఇటీవల గెలిచిన ప్రజాప్రతినిధులు సైతం హామీలు ఇవ్వడం జరిగిందని అన్నారు. గుడిస వాసుల హక్కుల సాధన కోసం ఈనెల 8న నిర్వహిస్తున్న శాంతియుత కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని గుడిసె వాసులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు సోమ మల్లారెడ్డి, పొదిల్ల చిట్టిబాబు, అంబాల మురళి మరియు గుడిసె వాసులు కాలనీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.