విధి నిర్వాహణలో ప్రజకు భరోసా ఇచ్చేది పోలీసులే..

It is the police who give assurance to the public in the performance of duty.– ఎస్సై సిహెచ్ ప్రమోద్ కుమార్
నవతెలంగాణ – శాయంపేట
రోజుకు 24 గంటలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విధి నిర్వహణ చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చేది పోలీసులేనని ఎస్సై సిహెచ్ ప్రమోద్ కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం రాత్రి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో పోలీస్ జాగృతి కళాబృంద సభ్యులు అమరవీరులకు సంతాపం తెలియజేస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై ప్రమోద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ నక్సలైట్ల అణచివేతలో ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయి అమరులయ్యారని అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాల వ్యసనాల బారిన పడకుండా సన్మార్గంలో పయనిస్తూ కన్న తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. మద్యం మత్తులో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని సూచించారు. సైబర్ నేరస్తుల పన్నిన వలలో చిక్కుకోకూడదని, అనవసర లింకులు ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు. గంజాయి, గుడుంబా నియంత్రణకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాజాత సభ్యులు నాగమణి, విలియం, వెంకటేశ్వర్లు, రత్నాకర్, విక్రం, శరత్, నారాయణ, చిరంజీవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.