నేల స్వభావాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే..

It is the responsibility of the farmers to preserve the nature of the soil.– మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి 
నవతెలంగాణ – పెద్దవంగర
నేల స్వభావాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదేనని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మానవాళికి మృత్తిక లకు ఉన్న సంబంధం గురించి, జీవన ఎరువుల యెక్క ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలన్నారు. విపరీతమైన రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకంతో నేల స్వభావం మారి, పంటల దిగుబడి తగ్గుతుందని అన్నారు. తెలంగాణలో 22 రకాల నేలలు ఉన్నాయని, నల్ల, ఎర్ర, ఇసుక నేలల్లోనే అనేక రకాలు ఉన్నాయని పేర్కొన్నారు. నీటి నిలువ సామర్థ్యం, పోషకాల లభ్యత నేల స్వభావం బట్టి ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో అక్కడక్కడా చౌడు భూములు ఉన్నాయని, వాటిని కూడా సాగులోకి తేగలమని అన్నారు. మన నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉందన్నారు. దీనిని సరిచేయడానికి పచ్చిరొట్ట ( జీలుగ, జానుము, పిల్లి పెసర) ఎరువులు వాడాలన్నారు. మన నేలల్లో సూక్ష్మపోషకాల లోపాలు కూడా ఉన్నాయని తెలిపారు. వేసవి కాలంలో భూమిని వాలుకు అడ్డంగా దున్నుకోవడం వలన భూమి కోతకు గురి కాకుండా ఉంటుందని, సారవంతమైన కర్భనా పదార్థాలు కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చు అన్నారు. దీంతో నత్రజని వాడకాన్ని కూడా సగానికి తగ్గించవచ్చునని చెప్పారు. దీని వలన ఖర్చు తగ్గడమేకాక, నేలను పరిరక్షించవచ్చునని అన్నారు. ఒక ఇంచు నేల ఏర్పడడానికి వందల సంవత్సరాలు పడుతుందని, 60 శాతం బోరుబావులు చాలా లోతునుండి నీళ్ళు తోడడం వల్ల లవణాలు పైకి వచ్చి నేలపై పొరగా ఏర్పడి దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. నేలపై మార్పులు నెమ్మదిగా వస్తాయని, భవిష్యత్ తరాలకు మంచి నేలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు యశస్విని, రాజు, విశ్వశాంతి, రైతులు పాల్గొన్నారు.