ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాలలో చదువుకునే 17లక్షలమంది విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఆ రాష్ట్రంలో ఏర్పాటైన 16 వేలకుపైగా మదర్సాలు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చిచెప్పింది. ఈ పాఠశాలలు లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. చట్టం రూప కల్పనలో లోపాలున్నాయని నిరూపించినప్పుడు, ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ నిబంధనలకు భంగం కలిగినట్టు నిర్ధారించినప్పుడు మాత్రమే ఆ చట్టాన్ని రద్దు చేయగలరని తెలిపింది. యూపీ ప్రభుత్వం 2004లో ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలను నియంత్రిస్తూ మదర్సా విద్యామండలి చట్టాన్ని తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని 25వ ప్రవేశికకు అనుగుణంగానే ఈచట్టం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భాష, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకుని, నిర్వహించుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని సైతం న్యాయస్థానం గుర్తుచేసింది. అయితే, మదర్సా విద్యాసంస్థలు జారీచేసే ‘ఫాజిల్ (డిగ్రీతో సమానం)’, ‘కామిల్ (పీజీతో సమానం)’ స్థాయి పట్టాలపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. యూజీసీ నిబంధనలకు ఇది విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ ”మదర్సాల్లో బోధనా కోర్సుల్లో గణితం, సైన్స్, సామాజికశాస్త్రం వంటి సబ్జెక్టుల ప్రమేయం వుండదని, సెక్యులర్ సబ్జెక్టులను చదవడమనేది పూర్తిగా మన ఇష్టం” అని లాజిక్‌ను తీసుకువచ్చారు. ఆ లాజిక్‌ను తిప్పికొడుతూ సర్వోన్నత న్యాయస్థానం ”మదర్సాలా బోర్డు చట్టాన్ని కొట్టివేయడంలో పరిష్కారం లేదు. మదర్సాల్లో చదువుకునే విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర విద్యాసంస్థల్లో అందచేసే నాణ్యత కలిగిన విద్యను పొందేలా చూసేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలి” అని వ్యాఖ్యానించింది. మదర్సాల్లో చదివే వారితో సహా మొత్తంగా విద్యార్థులందరి పట్ల ‘చట్టబద్ధమైన ప్రభుత్వ ప్రయోజనం’ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లయితే, జీవితంలో వారు మంచి స్థానాల్లో నెలకొనేలా నాణ్యతా ప్రమాణాలు కలిగిన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలని కూడా స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ముస్లింలు విద్యాసంస్థలు నిర్వహిస్తే దాన్ని అనుమాన దృష్టితో చూడటం అలవాటైన రోజుల్లో సుప్రీంకోర్టు తాజా తీర్పు మతోన్మాదులకు ఒక చెంపపెట్టు. మదర్సాలలో విద్యాభ్యాసం చేసే వారు ఒక ఉత్తరప్రదేశ్‌లోనే కాదు దేశమంతటా ఉన్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో మదర్సాలు ప్రముఖమైన పాత్ర పోషించిన వాస్తవాన్ని విస్మరించకూడదు. వీటిలో చదువుకున్న అనేక మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. స్వాతంత్య్రం తర్వాత మదర్సాలు చట్టబద్ధంగానే ఏర్పాటయ్యాయి. వీటి నిర్వహణ రహస్య వ్యవహారం ఏమీకాదు. తొలినుంచి వీటిని వ్యతిరేకించే బీజేపీ తాను అధికారంలోకి వచ్చింది మొదలు తమ విద్వేష రాజకీయాల్లో వీటిని భాగం చేశాయి. మదర్సాలలో కేవలం ఇస్లాం మత బోధనలే కొనసాగడం లేదు. దానితో పాటు హిందీ, ఇంగ్లీషు లాంటి భాషలు, కంప్యూటర్ విద్య లాంటివీ ఉంటాయి. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఈ విద్యాలయాల్లోని ఉపాధ్యాయులను, విద్యార్థులను మామూలు విద్యాలయాల్లో చేర్పించాలను కున్నారు. దానికి అనేక శక్తులు ఎన్నో అవాంతరాలు కలిగించాయి. ఆ విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేశాయి.
ఒక మతంవారు ప్రత్యేకంగా విద్యాలయాలు నడపకూడదని వాదించడం ప్రారంభిస్తే అది క్రమంగా ఇతర మతాలు నడిపే విద్యాలయాలకు కూడా వర్తింపచేసే ప్రమాదముంది. హిందూ సంస్థలు కూడా పాఠశాలలను నడుపుతున్నాయి. ఆరెస్సెస్ సరస్వతీ శిశు విద్యామందిరాల లాంటివి నడుపుతూనే ఉన్నాయి. అందులో చేయించే ప్రార్థనలూ సైతం భిన్నంగానే ఉంటాయి. కాని దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే మదర్సాల దగ్గర కొచ్చేసరికి బోలెడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. మదర్సా విద్యను మరింత మెరుగు పరచవలసిన అవసరం ఉండొచ్చు. ఆపని చేయడానికి రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ మతానికి చెందిన ప్రతినిధులతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవచ్చు. ఒక మతంవారు, ముఖ్యంగా విద్యాలయాలను నెలకొల్పితే వక్ర దృష్టితో చూడవలసిన అగత్యమేమి లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను జాతి, మతాలతో నిమిత్తం లేకుండా రాజ్యాంగం అందరికీ కల్పించింది. అదే సమయంలో మతం మారే హక్కునే కాదు… ఏమతాన్ని అనుసరించకుండా ఉండే హక్కును సైతం ఇచ్చింది. అలాంటప్పుడు ఒక మతాన్నే వెలేసినట్టు చూడటమే నిజానికి రాజ్యాంగ విరుద్ధం.