రెప్పలాడని వాళ్ళ రంగభూమి

రెప్పలాడని వాళ్ళ రంగభూమిమరీ శిథిలమైపోకుండా
కాస్త గౌరవంగానో కాస్త ఆదరంగానో
మన ఉనికిని మరుగుపెట్టే చోటిది
ఈ తీరం చేరి విశ్రమించకపోతే
కొండితోక పట్టుకుని ఎంతకని కాలాన్నంతా ఈదుకెళతాం?
రంగులమయంగా ఊరేగే బ్రతుకు నుండి
ఏదో ఒక దశలో వర్ణాలన్నీ ఉపసంహరించుకోకపోతే
వేదిక మొత్తం మరకలు మరకలు
ఊపిరితో ఉండగా ఊసెత్తడానికే
ఇష్టపడని చోటు ఇదే –
ఊపిరి వొదిలాక ఊరడించే చోటూ ఇదే!
బట్టలు ముసుగులు పరదాలు
వేటి అవసరమూ లేకుండా
నువ్వు లేనిచోట నిన్ను దాచేచోటు
నేను లేనివేళ నన్ను పొదువుకునే చోటు
ప్రేమపాశాల రోదన శత్రువుల ఉక్రోషం
పేదోడి ఏడుపూ ఉన్నోడి కన్నీరూ
ఎన్ని దొంగుర్ల వరదయినా
పొలిమేరలో ఇంకిపోవాల్సిందే
బతుకంతా తడికళ్లు వెంటాడినా
ఆఖరిస్నానం తరువాత
కాళ్ళు సైతం తడవకూడదని కాబోలు
నాలుగు భుజాల మీదికి ఎత్తి
నలుగురిక్కడికి మోసుకొస్తారు
ఒకసారిక్కడ పాడె దిగితే
ఆకలీ అప్పూ చీకూ చింతా ఏవీలేని
అనంత కాలపు నిద్రావస్థ
విద్వేషం వివక్ష తారతమ్యం
అడుగైనా పెట్టలేనంత సౌకర్యం
ఈ చోటుకు ఉన్నంత హదయవైశాల్యం
బయట కూడా ఉంటే
అసలు చచ్చే ఖర్మేం పట్టేది చెప్పండి!
– కంచరాన భుజంగరావు, 9441589602