పుష్ప2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి, ఓ రకంగా తెలుగు సినీ ఇండిస్టీని షేక్ చేసింది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, ప్యాన్స్ విచ్చలవిడితనం, నటీ నటుల సామాజిక బాధ్యతలు, టికెట్ల ధరల పెరుగుదల, సినీ ప్రేక్షకుల భద్రత వంటి అంశాలు రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. దీన్ని సీరి యెస్‌గా పరిగణించిన ప్రభుత్వం ఇకనుంచి బెనిఫిట్‌షోలు,ఇష్టారీతినా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతులిచ్చేది లేదని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. అయితే అది ప్రకటనలకే పరిమితం కాకుండా నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించి అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సీఎంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంలోనూ బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అంశం ప్రస్తావన వచ్చినప్పటికీ అసెంబ్లీలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నట్టు మీడియాలో వచ్చింది. కానీ బెనిఫిట్‌షోలకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఎందుకు అనుమతినివ్వాల్సి వచ్చిందన్న చర్చ కూడా ప్రధానంగా జరుగుతున్నది. రేవతి మృతిచెందడం, ఆమె కొడుకు శ్రీతేజ్ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుండటం పట్ల పౌరసమాజం స్పందించింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు, అల్లు అర్జున్‌కు రిమాండ్ చేయడం, ఒక రాత్రంతా జైల్లో ఉండి మరుసటి రోజున ఆయన విడుదల కావడం తెలిసిన విషయమే. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ అరెస్టుపై ఇండిస్టీ, మీడియా, రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. అల్లు అర్జున్ అనుమతి లేకుండా అక్కడికి రావడం, జరిగిన ఘటనపైనా బాధ్యతాయుతంగా లేకపోవడం, పోటీ ప్రెస్‌మీట్‌లు పెట్టి తన నుంచి అసలే తప్పు ఏమీ లేదన్నట్టుగా మాట్లాడిన తీరు అభ్యంతరకరం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలి.
అల్లు అర్జున్ అనుమతి లేకున్నా, థియేటర్‌కు రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని పోలీసుల వాదన. దాన్ని కంట్రోల్ చేయా ల్సిన బాధ్యతెవరిది, వారిది కాదా?ఆర్టీసీ క్రాస్‌రోడ్ వాణిజ్య, వ్యాపార, విద్యా, రాజకీయ పరంగా ట్రాఫిక్ జామ్ సమస్యలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఏదైనా ప్రజా సమస్యలపైన ఆర్టీసీ క్రాస్ రోడ్లో చిన్నపాటి నిరసన కార్యక్రమం చేపడితేనే వందలాది మంది పోలీసులు క్షణాల్లో రాగలిగినప్పుడు, వేలాది మంది గుమికూడిన జన సందోహం రోడ్డుపై కనిపిస్తున్నా ఎందుకని చర్యలు తీసుకోలేక పోయారు? సినిమా అనేది ప్రజల దైనందిన జీవితంలో ప్రధాన భాగం. కానీ, నేడు సినీపరిశ్రమలో వ్యాపార ధోరణి మరింత పెరిగింది. వినోదం పేరుతో మితిమీరిన హింస, రక్తపాతం, శృంగారం, మూఢ విశ్వాసాలు, కీణిస్తున్న విలువలు, కులం, మతం వంటి భావోద్వేగాలతో, ఇతర వర్గాలను కించపరిచేలా, రెచ్చగొట్టేలా సినిమాలు వస్తున్నవి. ఇవి సమాజం, యువత మీద తీవ్ర ప్రభావం చూపుతున్నవి. కార్పోరేట్ల అనుకూల భావాల వ్యాప్తికి సినీపరిశ్రమలో ఇటీవల కాలంలో వస్తున్న మార్పులు అధికం. ఒకప్పుడు సినిమాలు సామాజిక అంశాల ఇతివృత్తంగా వచ్చేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. తమిళ, కన్నడ, మలయాళి హిందీ సినిమాల్లో కొన్ని సందేశాత్మక చిత్రాలు వస్తున్నవి. టాలీవుడ్‌లోనే ఆ కొరత కనిపిస్తున్నది.
పెరిగిన ఆధునిక టెక్నాలజీ ద్వారా గతం కంటే ఇప్పుడు సినిమాలు నిర్మించడం సులభం అనే చర్చ కూడా ఉంది. తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న అనేక చిన్న సినిమాలు అందుకు ఉదాహరణ. సినిమాల ప్రమోషన్ల కోసం అనేక ఈవెంట్లు, పబ్లిసిటీ, అధిక రెమ్యూనరెషన్లు, వాటిపై లాభాల కోసం భారీగా టికెట్ల ధరలు పెంచడం ప్రేక్షకులకు మోయలేని భారం. సాధారణ టికెట్ ధరలను కూడా పెద్ద సినిమాల విడుదల సమయంలో వారం పదిరోజుల పాటు విపరీతంగా పెంచడం మూలంగా సినీ ప్రేక్షకులకు అదనపు నష్టం. విపరీతంగా పెరిగిన మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో పెరిగిన ధరలతో సామాన్యులు సినిమాలు వీక్షించలేని పరిస్థితి నెలకొంది. సినిమా ఇండిస్టీ ప్రభుత్వం నుండి అనేక రూపాల్లో రాయితీలు పొందు తోంది. చిత్ర పన్ను మినహాయింపు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు, ఇవన్నీ ఎలా సాధ్యం? ప్రజలు వివిధ రూపాల్లో పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న వాటి నుండే కదా! ప్రజల సంపూ ర్ణ భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యమా? తెలుగు సినీ ఇండిస్టీ నేడు పాన్‌ఇండియా స్థాయికి ఎదిగింది. దానికి కారణమెవరు? నటీనటుల పాత్రతో పాటు,ఆ సినిమాలను వీక్షించిన ప్రజలది. సినిమా ఎలా ఉన్నా వినోదం, కాలక్షేపం కోసం జనం మెచ్చి చూస్తున్న ఫలితంగానే ఇండిస్టీ మనగలుగుతుంది.సినిమా వాళ్లకు కష్టనష్టాలు లేవా? అనే అభిప్రాయం కూడా రావచ్చు. కాదనలేం, ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కరిం చుకోవాలి. సర్కారు కూడా అన్ని పరిశీలించి సంస్కరణ లు చేసేందుకు మంచి సమయమిదే. ప్రజలకు ప్రయోజన కరంగా, చిత్ర పరిశ్రమకు మేలు జరిగే విధానాలు తీసుకురావాలి.
– కోట రమేష్, 9618339490