– జిల్లాను సర్వనాశనం చేసింది వారిద్దరే
– ప్రజలను మిస్ గైడ్ చేసేందుకే పర్యటనలు
– మమ్మల్ని వేటాడడం కాదు.. నీ కూతురుని ఈడి, నిన్ను ఫోన్ టాపింగ్ వేటాడుతున్నాయి
– జిల్లా ప్రజలు ఇది గమనించాలి.. అర్థం చేసుకోవాలి.. ఆలోచించాలి
– విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాష్ట్రంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉండి అన్ని రంగాలను ధ్వంసం చేసిన పాలన బిఆర్ఎస్ దే. రాష్ట్రానికి చేసిన నష్టం, ద్రోహం ఒక్కొకటిగా బయటకి వస్తున్నాయి. అందుకే ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసేందుకు కెసిఆర్, కేటీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేస్తూ పొలంబాట పేరుతోటి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జిల్లా ప్రజలు గమనించాలి.. అర్థం చేసుకోవాలి.. ఆలోచించాలి అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్, కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దొంగాటలను, ఆరోపణలను ఎండగట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవాకులు, చేవాకులు పేలుతున్నారు. వేటాడుతాం, వెంటాడుతాం, తరుముతాం, రణరంగం సృష్టిస్తామని అంటున్నారు. ఒకవైపు నీ బిడ్డను ఈడి వేటాడుతుంది. మరోవైపు నిన్ను ఫోన్ టాపింగ్ వెంటాడుతుంది. బయటకు వెళ్లేందుకు ముఖం చూపించుకునే పరిస్థితి లేక అబద్ధపు మాటలతో ప్రజల్లోకి వెళ్లాలని యాత్ర చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలన్నారు. 9 సంవత్సరాలు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి జిల్లాలో అదనంగా ఒక్క ఎకరానికైనా సాగునీరు తెచ్చారా అని ప్రశ్నించారు. సోరంగమార్గాన్ని పూర్తి చేశావా? బ్రాహ్మణ వెల్లముల పూర్తయిందా? శివన్న గూడెం, డిండి సంగతి ఏంటి? పిలాయి పల్లి, ధర్మారెడ్డి సంగతి ఏంది? ఏ ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదు. ఈ విషయం తెలిసి కూడ జిల్లాలో కేసీఆర్, కేటీఆర్ పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాను నాశనం చేసింది, దగా చేసింది, మోసం చేసింది వారేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పి జిల్లాకు వస్తే ఆలోచించే వారని అన్నారు. కరువు వస్తే ప్రజలకు ధైర్యం చెప్పాలి. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచన చేయాలి. రంగరించి.. కరిగించిన మెదడుతో సూచన చేయకుండా రైతులు ఆత్మహత్య చేసుకునే విధంగా తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో మారు సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చి ఆత్మహత్యలకు ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఇది మాజీ ముఖ్యమంత్రికి తగదని, పద్ధతి మార్చుకొని మాట్లాడితే కనీసం గౌరవమన్న దక్కుతుందన్నారు. గత మంత్రి చేసిన పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలోనే బ్రాహ్మణవెల్లముల ప్రాజెక్టు, సొరంగ మార్గానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వాటి ద్వారానే ఆ సమయంలో కొంతైనా నీరు ఇచ్చారని అన్నారు. 285 కోట్లతో పిలాయి పల్లి, ధర్మారెడ్డి కాలువ టెండర్ అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, గులాబీ కాంట్రాక్టర్ల పాపాన ఆ ప్రాంతంలో పశువులు తాగడానికి కూడా నీళ్లు లేకుండా పోయిందని ఆవేద చెందారు. గురుకుల పాఠశాలల గూర్చి మాట్లాడే కెసిఆర్ ఒక్క గురుకులానికైనా సొంత భవనాన్ని నిర్మించారా అని ప్రశ్నించారు. అద్దె భవనాలలో విద్యార్థులు అవస్థలు పడుతుంటే చూస్తూ ఉన్నారే తప్ప ఏమి చేయలేదన్నారు. విద్యా వ్యవస్థను పడుకోబెట్టారు. వైద్యాన్ని నాశనం చేశారు. ఇలా రాష్ట్రంలోని అన్ని రంగాలను ధ్వంసం చేసిన పాలన మీదే అని విమర్శించారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. మూడు ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడికి పోయాయని అన్నారు. వందరోజుల కాంగ్రెస్ పాలనలో మమ్మల్ని వేటాడుతా, వెంటాడుతా అంటున్నావ్. ప్రజలు మిమ్మల్ని వేటాడి, వెంటాడి ఇంట్లో కూర్చోబెట్టిన బుద్ధి రాలేదా అని విమర్శించారు. ఓడిపోతే ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో, ప్రజల పక్షాన ఉండలేరా అని అన్నారు. కృష్ణా రివర్ బోర్డు కేంద్రానికి అప్పగించారని హడావిడిగా మీటింగ్ పెట్టారు. 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నీటి వాటిపై మాట్లాడలేదని ప్రశ్నించారు. 299 టీఎంసీల నీటి వాటపై కొట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవన్నారు. మీరు చేసేది దొంగ డ్రామా, దొంగయాత్ర తప్ప మరొకటి కాదని అన్నారు. కాలేశ్వరం పిల్లర్లు మరింత కుంగి తెగిపోయే ప్రమాదం ఉందని స్వయంగా మేనేజ్మెంట్ బోర్డ్ చెప్పిందని అన్నారు. పిల్లర్లు కుంగటం సర్వసాధారణమని కెసిఆర్ చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. జిల్లాలో బిఆర్ఎస్ కు సీట్లు వచ్చే పరిస్థితి లేదని పార్టీని కాపాడుకోలేక కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆ డ్రామాలను బందు చేయాలని అన్నారు. మా నాయకులు, మంత్రులపై విమర్శలను మానుకోవాలని ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.