ముగ్గురు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై ఐటీ మెరుపు దాడులు

– వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ
– మొత్తం 60 ప్రాంతాల్లో సోదాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల ఆస్థులపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) బుధవారం మెరుపుదాడులను నిర్వహించింది. ఐటీ అధికారులు టార్గెట్‌ చేసినవారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంటు సభ్యుడు ఉన్నారు. వీరికి సంబంధించి మొత్తం 60 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఉదయం నుంచే దాడులను ప్రారంభించారు. మొత్తం 59 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, భువనగిరితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొండాపూర్‌లోని ప్రభాకర్‌రెడ్డికి చెందిన విల్లాతో పాటు సమీపంలోని అతని కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అలాగే, జూబ్లిహిల్స్‌లోని ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి నివాసంతో పాటు అతనికి చెందిన కూకట్‌పల్లిలోని జేసీ బ్రదర్స్‌ షోరూమ్‌తో పాటు ఇతర కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపారు. అలాగే, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి బావ, భువనగిరి మాజీ తహశీల్దార్‌ అయిన మోహన్‌రెడ్డి నివాసంలో సోదాలు ప్రారంభించిన అధికారులు అక్కడ లభించిన పత్రాలతో కొత్తపేట్‌లోని శేఖర్‌రెడ్డి నివాసంతో పాటు భువనగిరిలోని ఆయన రియల్‌ఎస్టేట్‌ కార్యాలయాల్లోనూ దాడులు చేశారు. అంతేగాక సదరు ప్రజాప్రతినిధుల సమీప కుటుంబసభ్యులు, స్నేహితుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు దాడులు జరిపి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గత మూడేండ్ల కాలంలో చెల్లించిన ఆదాయపు పన్ను రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వారి కార్యాలయాల్లోని ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి కంప్యూటర్‌లోని హార్డ్‌ డిస్క్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాడులు జరుపుతున్న సమయంలో తమకు సెక్యూరిటీగా ఐటీ అధికారులు కేంద్ర బలగాలను వెంట తెచ్చుకున్నారు. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను బదనాం చేయడానికే బీజేపీ నాయకత్వం అక్రమంగా ఐటీ దాడులను చేయిస్తున్నదని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ బీఆర్‌ఎస్‌ను నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు బీజేపీ పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు. తన వ్యాపారాలకు సంబంధించి ఐటీ చెల్లింపులను సక్రమంగా నిర్వహిస్తున్నామని, తమ వ్యాపార లావాదేవీలు తెల్ల కాగితంలా స్పష్టంగా సాగుతాయనీ, తాను ఐటీ పరంగా ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు.