– ఎన్నికల ముందే ఒకసారి దాడులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని పలు రైస్ మిల్లులపై ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. మిర్యాలగూడలోని సాయి జయలక్ష్మి, సాంబశివ, సూర్య, వైష్ణవి ఫుడ్ రైస్ ఇండిస్టీస్, ఆర్‌విఎస్ రైస్ ఇండిస్టీస్‌లో అధికారులు విస్తృత సోదాలు చేస్తున్నారు. మూడు బృందాలుగా ఏర్పడిన అధికారులు రాత్రి వరకు సోదాలు సాగిస్తున్నారు. ఎన్నికల ముందు నవంబర్ 16, 17 తేదీల్లో ఒక దఫా దాడులు సాగించిన ఐటీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. 5కోట్ల నగదుతో పాటు కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజులు గడవక ముందే రెండో దఫా మిర్యాలగూడ మిల్లర్లపై ఐటీ దాడులు కొనసాగడం మిల్లర్లతోపాటు రియల్ వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో కూడా ఐటీ రైడ్స్ సాగుతున్నందున అక్కడి సమాచారం మేరకు మిర్యాలగూడలోనూ సోదాలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.