– బంధువుల ఇండ్లతో సహా ఏకకాలంలో 33 చోట్ల రైడింగ్
– ఉదయం 5 గంటల నుంచి సోదాలు ప్రారంభం
– రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే…
– ఖమ్మంలో పొంగులేటి ఇంటివద్ద ఉద్రిక్తత
– కలత చెంది పొంగులేటి అభిమాని ఆత్మహత్యాయత్నం
– నామినేషన్ రోజే దాడులపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఊహించినట్లుగానే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఆదాయ పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు పొంగులేటి బంధువుల ఇండ్లతో సహా ఏకకాలంలో ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, ఇండ్లు, కళ్యాణ మండపాల్లో సోదాలు చేపట్టారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని పొంగులేటి, ఆయన సోదరుడు ప్రసాద్‌రెడ్డి ఇంటితో పాటు రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయాలు, ఖమ్మంలోని ఆయన ఇల్లు, రాఘవ కార్యాలయం, ఎన్‌ఆర్ కనెన్షన్, గార్డెన్స్, ఖమ్మం రూరల్ మండలం సాయిగణేశ్‌నగర్‌లోని పొంగులేటి ఎన్నికల కార్యాలయాలతో పాటు క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి ఇల్లు, కల్లూరు మండలం నారాయణపురంలోని ఇల్లు, ఇతరత్ర ఆయన బంధువుల ఇండ్లలోనూ సోదాలు చేపట్టారు. పొంగులేటి సహా ఆయన కుటుంబసభ్యులు భార్య మాధురి, కుమారుడు హర్ష, కుమార్తె స్వప్నీరెడ్డి, ఆయన సోదరుడు ప్రసాదరెడ్డి, భార్య శ్రీలక్ష్మి ఖమ్మంలోనే ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు వచ్చీరాగానే కుటుంబసభ్యులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది, ఆ సమయంలో అక్కడున్న అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 వాహనాల్లో వచ్చిన 15 మందికి పైగా ఐటీ అధికారులు, పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ దాడులు చేపట్టారు. వారికి కావాల్సిన ఫైల్స్ అన్నీ పొంగులేటి అందజేశారు. ఇంట్లో అన్ని రూమ్‌లనూ జల్లెడ పట్టారు. హైదరాబాద్‌లోని పొంగులేటి ఇల్లు, కార్యాలయాల్లో ఉన్న లాకర్స్ ఓపెన్ చేసేందుకు వేలిముద్ర కోసం గురువారం ఉదయం నామినేషన్ పూర్తయిన వెంటనే ఆయన భార్య మాధురిని హైదరాబాద్ రావాల్సిందిగా అధికారులు కబురు చేశారు. వెంటనే ఆమె అక్కడికి వెళ్లారు. సాయంత్రం ఆయన సోదరుడు ప్రసాదరెడ్డిని సైతం హైదరాబాద్ తీసుకుని వెళ్లారు. కాగా, రెండు, మూడు రోజుల్లో తనపై దాడులు జరుగుతాయని పొంగులేటి చెప్పిన 24 గంటల్లోపే ఐటీ దాడులు చేపట్టడం గమనార్హం. ఇలాంటి దాడులతో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరని ఈ సందర్భంగా పొంగులేటి అన్నారు.
పొంగులేటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయని తెలిసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకొని గేటు ఎదుట రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. కేసీఆర్ డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. పొంగులేటి అభిమాని కొమ్ము ఉపేందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా.. అక్కడున్న వారు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారు. పొంగులేటి బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు గత ఎన్నికల సందర్భంలోనూ ఆయన ఇంటిపై దాడులు చేశారు. ఇప్పుడు కేసీఆర్ అవినీతిపై నేరుగా ప్రశ్నిస్తుండటంతో ఆయన్ను ఏదో ఒకరకంగా ఇబ్బందులకు గురిచేయాలనే బీఆర్‌ఎస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.