ఇంటింటికి ఆరు గ్యారెంటీలు అందేలా చూడాలి

నవతెలంగాణ – రాయపర్తి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరు గ్యారెంటీ పథకాలను ఇంటింటికి చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో చేయనున్న అభివృద్ధి పనుల గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చూపారు. నాయకులు, కార్యకర్తల సంపూర్ణ మద్దతుతో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎల్లవేళలా కాపాడుకుంటా అని హామీ ఇచ్చారు. రాయపర్తి మండలంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పాలకుర్తి నియోజకవర్గం సైతం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఆరు గ్యారెంటీలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత కార్యకర్తలపై ఉంది అన్నారు. నిరుద్యోగాన్ని తరిమికొట్టడమే ప్రధాన లక్ష్యంగా, తమ సొంత నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా నిలవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు హమ్య నాయక్, నాయకులు మాచర్ల ప్రభాకర్, కృష్ణమాచార్యులు, కృష్ణ రెడ్డి, ముద్రబోయిన వెంకన్న, రత్నాకర్ రెడ్డి, వెంకన్న, నీలయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.