వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది కలగకుండా చూడాలి: కలెక్టర్

– మొక్కలు ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పెట్టాలి
– ఉపాధి హామీ పథకం కింద వీలైనంత ఎక్కువ మంది కూలీలకు పని కల్పించాలి
– జిల్లా కలెక్టర్  హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వేసవి కారణంగా గ్రామాలు, పట్టణాలలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  హరిచందన దాసరి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి  వివిధ అంశాలపై గ్రామ పంచాయతీల ప్రత్యేక  అధికారులు,ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో  జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పలు సూచనలను చేస్తూ   గ్రామపంచాయతీ ట్రాక్టర్లను పూర్తిగా ప్రత్యేక అధికారులు వారి నియంత్రణలో ఉంచుకోవాలని, ప్రతి గ్రామానికి తాగునీటి వనరులను గుర్తించాలని, పూర్తిగా క్లోరినేషన్ చేసిన తర్వాత మాత్రమే తాగునీటిని ప్రజలకు అందించాలని, ఎక్కడైనా పంపులు  మరమ్మతుకు  వచ్చినట్లయితే మరమ్మతులు చేయించాలని, నీరు వచ్చేందుకు  అవకాశం ఉన్న బోర్లను మాత్రమే  ఫ్లషింగ్ చేయాలని, కొత్త  బోర్లు వేయవద్దని, ప్రతి గ్రామానికి సవరించిన సూక్ష్మ ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.
వేసవి కారణంగా మొక్కలు ఎండిపోయేందుకు అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా మొక్కలకు నీరు పెట్టాలని, అదేవిధంగా మొక్కల చుట్టూ బియ్యపు పొట్టు, మట్టితో కలిపి చెట్ల చుట్టూ వేస్తే తేమగా ఉండడానికి అవకాశం ఉందనిపేర్కొన్నారు.క్రమం తప్పకుండా మొక్కలకు నీరు అందించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద అన్ని గ్రామాలలో పనులను గుర్తించడమే కాకుండా, కూలీలు చేసే పనులను పెంచాలని, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.ప్రతి గ్రామానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు గ్రామాలకు వెళ్లి  ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.గ్రామాలలో  పారిశుధ్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా ప్రతిరోజు  పారిశుధ్య కార్యక్రమాలపై ఫోటోలను అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజాపాలనకు సంబంధించి అన్ని ఎంపిడిఓ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డేస్కులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామపంచాయతీలలో ఆస్తిపన్ను వసూలు పై ప్రత్యేక దృష్టి  కేంద్రీకరించాలని, మార్చి చివరినాటికి నూటికి నూరు శాతం పన్ను వసూలు చేయాలని అన్నారు.  ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఇంకా  వివరాలు పంపించాల్సిన గ్రామాలు తక్షణమే పంపించాలని, పట్టణ ప్రాంతాలలో ఈ పథకం కింద వీలైనంత ఎక్కువమంది చేతివృత్తుల దారులు ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ నాగిరెడ్డి, జెడ్పి సీఈఓ  ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ మురళి, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.