నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని ప్రస్తుతము కురుస్తున్న అధిక వర్షాల వలన మొక్కజొన్న సాగు చేసే రైతులు వివిధ సమస్యలను, తెగుళ్లు, మురుగునీరు నిలుచుట, కత్తెర పురుగు ఆశించడానికి ఆస్కారం ఉండటం వలన ఈరోజు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు గాంధారి మండలంలోని చద్మల్ తండా గ్రామము పర్యటించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి నరేష్ మాట్లాడుతూ.. ప్రధానంగా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఉద్రితి మొదలైనట్లు గుర్తించడమైనది. ఎడతెరిపిలేని ముసురు వానలు, నేలలో అధిక తేమా ఉన్న పరిస్థితులలో ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు. తెగులు సోకిన మొక్క పైభాగం నుంచి వడలి పోయి ఆకుల అంచుల వెంబడి ఎండడం తర్వాత క్రింది ఆకులు కూడా పూర్తిగా ఎండిపోతాయి. కాండం గోధుమ రంగుగా మారి వేడినీళ్ళలో ఉడక బెట్టిన బెండులాగా తయారవుతుంది. కాండాన్ని చీల్చి చూసినప్పుడు కణుపు దగ్గరి కణజాలం మెత్తగా నీటిలో తడిచినట్లు కనిపించి కుళ్ళి, మురిగిన కోడిగుడ్డు వాసన వస్తుంది. కొన్ని సార్లు పీక లాగినప్పుడు మొక్క నుండి విడిపోయి బయటకు రావడంజరుగుతుందని, దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పొలము నుండి తీసి దూరంగా పారవేయాలి. మురుగు నీటి కాలువలు ఏర్పరుచుకొని మొక్కజొన్నలో నీళ్ళు నిలబడకుండా తీసివేయాలి. 35 % క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్ ను ఎకరాకు 4-5 కిలోల చొప్పున సాళ్ళలో వెదజల్లాలి లేదా 4గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణంతో మొక్కల మొదల్ల చుట్టు తడుపుకోవాలి. తాత్కాలికంగా యూరియా వేయడం ఆపివేయాలి. ఈ మొక్కజొన్న పంట పొలాల సందర్శనలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ నగేష్ కుమార్ ,డాక్టర్ మల్లయ్య మరియు వ్యవసాయ సహాయ సంచాలకులు వీరస్వామి , వ్యవసాయ అధికారి నరేష్ మరియు రైతులు శ్రావణ్ , రవీందర్ తదితర రైతులు పాల్గొన్నారు.