నెలరోజుల్లో క్రమబద్దీకరించాలి

It should be regularized in months– శాట్‌ కాంట్రాక్టు కోచ్‌ల సంఘం డిమాండ్‌
హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌)లో పని చేస్తున్న కాంట్రాక్టు కోచ్‌లను నెల రోజుల్లోగా క్రమబద్దీకరించాలని, రాష్ట్రంలో పని చేస్తున్న క్రీడా శిక్షకుల సమస్యల పరిష్కార బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకోవాలని శాట్‌ కాంట్రాక్టు కోచ్‌ల సంఘం తీర్మానం చేసింది. ఆదివారం ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో ఆ సంఘం సమావేశం జరిగింది. ‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలతో 28 మంది కోచ్‌లు 32 ఏండ్లుగా క్రమబద్దీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. 2022లో హైకోర్టు సైతం రెగ్యులరైజేషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా, శాట్‌ ఉన్నతాధికారులు క్రమబద్దీకరణ అంశంలో జాప్యం చేస్తున్నారు. 28 మంది కోచ్‌లను రెగ్యులరైజేషన్‌ చేయకుండా, నూతనంగా కోచ్‌ల నియామకం కోసం ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకూడదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా కోచ్‌ల సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలని’ శాట్‌ కాంట్రాక్టు కోచ్‌ల సంఘం అధ్యక్షురాలు సత్యవాణి కోరారు. నెలరోజుల్లోగా కోచ్‌ల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయకుంటే తదుపరి కార్యాచరణకు సైతం సిద్దమవుతామని కోచ్‌లు పేర్కొన్నారు.