ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకే ఖర్చు చేయాలి

– జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు
నవతెలంగాణ-భువనగిరి రూరల్‌
ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించే వస్తువులు, వాహనాలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ సూచించిన ధరలకు మాత్రమే ఖర్చు చేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఎ. భాస్కరరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. గురువారం నాడు ఆయన తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించే లౌడ్‌ స్పీకర్స్‌, పోడియం, ఫ్లెక్సీ బ్యానర్లు, క్లాత్‌ బ్యానర్లు, ఫ్లాగ్స్‌, పోస్టర్స్‌, హౌర్డింగ్స్‌, కటౌట్స్‌, వీడియోగ్రఫీ, పెన్‌ డ్రైవ్స్‌, క్యాసెట్లు, స్వాగత తోరణాలు, వాహనాల కిరాయిలు, డ్రైవరు బత్తాలు, హౌటల్‌ రూమ్స్‌ కిరాయిలు, ఫర్నీచర్‌, రవాణా ఛార్జీలు, చైర్స్‌, సోఫాలు, టెంట్స్‌, కార్పెట్స్‌, సైడ్‌ వాల్స్‌, వాటర్‌ డ్రమ్స్‌, టీ టిఫిన్‌, భోజనాలు, సామాగ్రి, విద్యుత్‌ బల్బులు, ఫ్యాన్స్‌, కూలర్స్‌, క్యాప్స్‌, స్కార్స్‌, టవల్స్‌, ఫోటో ప్రింటెడ్‌ టీషర్ట్స్‌, ఫంక్షన్‌ హాల్‌ కిరాయిలు, వాల్‌ రైటింగ్స్‌, కోలాటాలు, డప్పు, డ్రోన్‌ కెమెరా, ఎల్‌.ఇ.డి. స్క్రీన్స్‌, హైడ్రోజన్‌ బెలూన్స్‌, వాటర్‌ బాటిల్స్‌, స్టేజ్‌ డెకొరేషన్‌, స్టిక్కర్స్‌, టూవీలర్‌ కిరాయిలు, ఇంధన రేట్లు, తదితర ప్రచార వాహనాలకు సంబంధించి ఎన్నికల కమీషన్‌ సూచించిన రేట్లకు ఖర్చు లోబడి ఉండాలని తెలిపారు. నామినేషన్‌ ముందు వరకు రాజకీయ పార్టీలు, నామినేషన్‌ అనంతరం సంబంధిత అభ్యర్థి ఖర్చు లోనికి వెడుతుందని, రాజకీయ పార్టీలు తమ ప్రచార వివరాలను తెలియచేయాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సంబంధిత అధికారుల అనుమతులు పొందాలని, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు తదితర ప్రచార అనుమతుల కోసం సువిధ యాప్‌ ద్వారా ఆన్లైన్‌ దరఖాస్తు చేయాలని సూచించారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన సంఘటనలు, ఫిర్యాదులపై సి విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, వంద నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా కలెక్టరేటులో 24 గంటలు సేవలందించేందుకు 1950 నెంబర్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సిపిఎం నుండి బట్టుపల్లి అనూరాధ, బీఎస్పీ నుండి జహంగీర్‌, బట్టు రామచంద్రయ్య, కాంగ్రెస్‌ నుండి సయ్యద్‌ ముల్తానీషా, కె.యాదగిరి, బిజెపి నుండి పి.బలరాం, వివిధ ఎన్నికల విభాగాల నోడల్‌ అధికారులు సునంద, సుదర్శన్రెడ్డి, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నాగేశ్వరాచారి, డిప్యూటీ తహశీలుదారు సురేష్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులకు సూచనలు:
నిబంధనల ననుసరించి ఎన్నికల ప్రచార సామాగ్రిని ముద్రించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కరరావు ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన గురువారం నాడు కాన్ఫరెన్స్‌ హాలులో ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులతో సమావేశమై మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్‌ ముద్రించేటప్పుడు, ప్రచురించేటప్పుడు తప్పనిసరిగా ప్రింటర్‌, ప్రచురణ కర్త పేర్లు, చిరునామా, సెల్‌ ఫోన్‌ నెంబర్లు స్పష్టంగా పైన ముద్రించాలని సూచించారు. ముద్రించబడిన ప్రతులకు సంబంధించి 3 కాపీలను ప్రచురణ కర్త నుండి పొందిన డిక్లరేషన్‌తో సహా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 127(ఏ) ప్రకారం పంపాలని తెలిపారు. జిల్లా లోని ప్రింటింగ్‌ ప్రెస్సులు ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, మొదలైన వాటి ముద్రణ చేపట్టే ముందు నిర్దేశించిన ప్రోఫార్మాలో సెక్షన్‌ 127ఏ(2) ప్రకారం ప్రచురణకర్త నుంచి డిక్లరేషన్‌ పొందాలని, డిక్లరేషన్‌ పై ప్రచురణకర్త సంతకంతో ధ్రువీకరించబడాలని, దీనిని జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపే సమయంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని ధ్రువీకరించాలని తెలిపారు. ప్రింటర్‌ మెటీరియల్‌ డిక్లరేషనుతో పాటు సూచించిన ప్రొఫార్మాలో ముద్రించిన డాక్యుమెంట్‌ కాపీల సంఖ్య, సదరు ప్రింటింగ్‌ పనికి వసూలు చేసిన ధరకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రింటర్లు అందించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నాగేశ్వర చారి, డిప్యూటీ తహసిల్దార్‌ సురేష్‌, శ్రీకాంత్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.