”పలాస, నరకాసుర’ వంటి భిన్న చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట సత్య తెలుగు, తమిళ బాషల్లో తెరకెక్కించారు. సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హీరో రక్షిత్ అట్లూరి మీడియాతో చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘తండ్రి దర్శకత్వంలో నటించే అవకాశం ఎంతమంది పిల్లలకు వస్తుందో తెలియదు. మా నాన్న నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను ఆనంద్ శ్రీరామ్ అనే టీవీ రిపోర్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. హీరో, విలన్ ఇలా డ్యూయల్ రోల్ చేయాలని ఉంటుంది అయితే అది ఈ సినిమాతో తీరిందా లేదా అనేది స్క్రీన్ మీదే చూడండి. మా సినిమా ఎక్కువ మంది ఆడియెన్స్‌కు రీచ్ అవ్వడం కోసం సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించాం. సినిమా చూసి ఫస్టాఫ్‌లోగా సైకో ఎవరన్నది కనిపెట్టి మేము ఇచ్చిన నెంబర్‌కు వాట్సాప్ పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. విజయవాడ, వైజాగ్‌లో నా చేతుల మీదుగా ఈ కాయిన్ ఇస్తాను. ఈ సినిమాలో సైకో చిన్నప్పటినుంచి అలా ఉండడు. కొన్ని పరిస్థితుల వల్ల అలా అవుతాడు. మనలో ఆలోచనల అంతర్యుద్ధాన్ని ఇప్పటిదాకా ఎవరూ స్క్రీన్ మీద చూపించలేదు. మా సినిమాలో అలాంటి ప్రయత్నం చేశాం. సైకో తన ఆలోచనలను విజువలైజ్ చేసే సీన్ చూస్తూ ఆడియెన్స్ ట్రాన్స్‌లోకి వెళ్తారు. ‘పలాస, నరకాసుర’ చేసిన తర్వాత అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్నాననే అంటున్నారు. నాకూ ఆ భయం ఉంది. అయితే ఈ సినిమాతో పాటు ‘శశివదనే’ నన్ను కొత్తగా చూపిస్తాయని చెప్పగలను. ముఖ్యంగా ఈ సినిమా నన్ను ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసే సినిమా అవుతుందని నమ్ముతున్నా. ‘పలాస 2′ వర్క్ జరుగుతోంది. తప్పకుండా ఈ సినిమా ఉంటుంది’.