అఫిడవిట్లపై ఐటీ నిఘా

IT surveillance on affidavits– ఆస్తులు, ఆదాయం, అప్పుల చిట్టాల విశ్లేషణ
– గత ఎన్నికల అఫిడవిట్లు.. ప్రస్తుత పత్రాల పరిశీలన
– ఐదేండ్లల్లో సమకూరిన ఆస్తుల మూలాలపై ఆరా
– 24 గంటలు అదే పనిలో ఐటీ నిపుణులు
– ప్రతి నియోజకవర్గంలోనూ 8 మంది వరకు నియామకం
– ఎన్నికల ఖర్చులు, కేసులు, ఆస్తులపై డేగకన్ను
– మొదటిసారి ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్ల ఏర్పాటు
నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికల్లో ఆర్థిక అవకతవకలను నివారించడం, ఉల్లంఘనలపై విచారించడం కోసం ఎన్నికల కమిషన్‌ కొత్త వ్యవస్థను రంగంలోకి దించింది. రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లలో పేర్కొన్న ఆదాయం, ఆస్తులు, అప్పులపై నిఘా పెట్టింది. తొలిసారిగా ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్లను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు నామినేషన్‌ వేసిన రోజు నుంచే వారు పేర్కొన్న ఆస్తులు, ఆదాయం, అప్పులతో పాటు కేసులు, వారు పెట్టే ఖర్చుల లెక్కల్ని తేల్చేందుకు ఐటీ నిపుణుల్ని రంగంలోకి దించింది. ప్రతి నియోజకవర్గంలో ఏడెనిమిది మంది వరకు ఐటీ అధికారులతో యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటీ నిపుణులు.. అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించే పనిలో నిమగమయ్యారు.
ప్రతి నియోజకవర్గంలో ఐటీ యూనిట్లు
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నూ ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్లను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయ పన్నుల శాఖ పరిధిలో 150 మంది గ్రూప్‌-1 అధికారులతోపాటు ఇతర దర్యాప్తు సంస్థల నుంచి మరో 100 మందిని డిప్యూటేషన్‌పై నియమించినట్టు ఐటీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 9 మంది వరకు అధికారుల్ని నియమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ ఇంటెలిజెన్స్‌ యూనిట్లు రంగంలోకి దిగాయి. నామినేషన్ల గడువు పూర్తవ్వడంతో ఆయా నియోజకవర్గాల్లో లెక్కలు తేల్చే పనిలో ఉన్నాయి. ఎన్నికలు ముగిసే వరకు ఈ యూనిట్లు 24 గంటలపాటు ఇదే పనిలో ఉండనున్నాయి.
గడిచిన ఐదేండ్ల కాలంలో అభ్యర్థులకు ఆస్తులు ఎలా వచ్చాయి..? అనే కోణంలో ఆరా తీయడమే కాకుండా వాటి మూలాలను నిగ్గుతేల్చనున్నారు. కొత్తగా సమకూర్చుకున్న చర, స్థిర ఆస్తుల వివరాలను గతంలో సమర్పించిన ఐటీ రిటన్స్‌లో పేర్కొన్నదీ లేనిది కూడా ఐటీ యూనిట్లు విశ్లేషించనున్నాయి. ఆర్థిక వివరాల్లో తేడాలేమైనా కనిపిస్తే వెంటనే అభ్యర్థులకు ఐటీ శాఖ బృందాలు నోటీసులు జారీ చేస్తాయి. అభ్యర్థుల పాన్‌ ఆధారంగా వారివి, కుటుంబ సభ్యుల లావాదేవీలను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తారు. జాతీయ స్థాయిలో రిజర్వు బ్యాంకుతోపాటు రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్ల సహకారం తీసుకునేలా ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. ఐదేండ్ల కాలంలో ఐటీ రిటన్స్‌లో పేర్కొన్న ఆస్తుల లెక్కల వివరాల్ని పోల్చి వాటికి సంబంధించిన పూర్తి ఆధారాల్ని కూడా సేకరిస్తారు.
ఆర్థిక అవకతవకలపై నిఘా
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆర్థిక అవకతవకలకు పాల్పడనున్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి అభ్యర్థులు భారీఎత్తున ఖర్చు చేయనున్నట్టు ఐటీ అధికారులు అంచనా వేశారు. వివిధ రూపాల్లో పెట్టే ఖర్చుల్ని లెక్కగడుతున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలకు వస్తున్న జనం, వారికి సగటున పెడుతున్న ఖర్చుల్ని లెక్కగడు తున్నారు. సోషల్‌ మీడియా, పత్రికలు, టీవీల్లో అనుకూల వార్తలు, భోజనాలు, ట్రాన్స్‌పోర్ట్‌, పోస్టర్లు, బ్రోచర్లు, టీషర్ట్స్‌, చీరలు, జెండాలు, ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలు ఇలా ప్రతిదీ లెక్కించి రాస్తున్నారు. నగదు పంపిణీతోపాటు ఆన్‌లైన్‌ పద్ధతిలో చేరవేసే మార్గాల్ని కూడా కట్టడి చేసేలా ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక పోలీస్‌, ఇతర అధికార బృందాల్ని నియమించి గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు పెట్టే ఖర్చులతో పాటు వారు పేర్కొన్న కేసుల వివరాలపై కూడా పోలీస్‌, దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు ఆరా తీస్తున్నాయి.
ఈసీ కట్టడితో అభ్యర్థుల్లో ఆందోళన
ఎన్నికల కమిషన్‌ గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. నగదు, వస్తు రూపాన పంపకాలు చేయాలంటే జంకుతున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మూడు జిల్లాల్లో 11 అసెంబ్లీ నియోజక వర్గాలు న్నాయి. వీటిల్లో ఉద్దండులైన నాయకులు పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌ నుంచి సీఎం కె.చంద్రశేఖర్‌ రావుతో పాటు బీజేపీ నేత ఈటల రాజేందర్‌ పోటీ చేస్తున్నారు. వీరు ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, ఆదాయం, అప్పులు, కేసుల వివరాల్ని పేర్కొన్నారు. వాటిల్లో సొంత కారు లేదని ఇద్దరూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పనిచేసిన వీరికి సొంత కార్లు లేకపోవడం ఏమిటనేది కూడా పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ రూ.35.54 కోట్ల డిపాజిట్లు, రూ.23.50 కోట్ల చరాస్తులున్నట్టు పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ బ్యాంకు ఖాతాల్లో రూ.16.74 లక్షలు, భార్య పేరిట రూ.28.48 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. తన పేరిట వివిధ రూపాల్లో రూ.3.48 కోట్లు, జమున పేరిట రూ.15 కోట్లు ఉన్నట్టు చూపారు. స్థిరాస్తుల విలువ రూ.12.50 కోట్లు, చరాస్తుల విలువ రూ.16.74 లక్షలుగా చూపారు. వీరితో పాటు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల అఫిడవిట్లను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.