– అక్రమ వలసదారులకు క్షమాభిక్ష కల్పించినట్టు కాదు
– పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏపై సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6ఏపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది బంగ్లాదేశ్ విముక్తి తర్వాత మానవతా ప్రాతి పదికన 1985లో రూపొందించబ డిందనీ, భారత చరిత్రలో లోతుగా పొందుపరచబడిందని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ వలసదారులకు మంజూరు చేసిన క్షమాభిక్షతో ఈ నిబంధనను సమానం చేయలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై చంద్రచూడ్ మౌఖికం గా అభిప్రాయపడ్డారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మా సనం విచారణ చేపట్టింది. 1985లో కేంద్రం, అసోం ఉద్యమ నాయకుల మధ్య అస్సాం ఒప్పందంపై సంతకం చేసినప్పుడు చట్టం కింద సెక్షన్ 6ఏ ప్రత్యేక నిబంధనగా ప్రవేశపెట్ట బడింది. ఇది జనవరి 1, 1966 నుంచి మార్చి 25, 1971 మధ్య అసోంకు వచ్చిన విదేశీయులను భారత పౌరసత్వం కోరడానికి అనుమ తిస్తుంది. పౌరసత్వ చట్టంలోని ఈ నిబంధన బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి అక్రమ చొరబాట్లను చట్టబద్ధం చేసిందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఈ నిబంధన ద్వారా ఎంత మంది లబ్ధి పొందారనే దానిపై అధికారిక డేటాను కోరింది.