– సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలి
– జనవరి 5 నుంచి హైదరాబాద్‌లో ఏఐడీఆర్‌ఎం జాతీయ మహాసభలు :సన్నాహక సమావేశంలో కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏండ్లు పూర్తి చేసుకున్నా అట్టడుగు వర్గాలైన దళితుల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు ఇప్పటికీ వారికి అందడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు అన్నారు. వారి హక్కులు, అభ్యున్నతి కోసం పాటుపడేది, కొట్లాడేది కమ్యూనిస్టులేనని చెప్పారు. అఖిల భారత దళిత హక్కుల పోరాట సమితి (ఏఐడీఆర్‌ఎం) జాతీయ రెండో మహాసభల సన్నాహక సమావేశాన్ని ఆ సంఘం నాయకులు కె యేసు రత్నం అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ రాజ్ బహదూర్ గౌరు హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి మనిషికీ ఓటు హక్కు కల్పించడం మహత్తరమైనదని అన్నారు. సమ న్యాయకల్పనలో ప్రభుత్వాల కృషిలో లోపం కనిపిస్తున్నదని విమర్శించారు. తరతరాలగా అణచివేత, అంటరానితనం, వివక్షత, దోపిడీ, పీడనాల కింద నలిగిపోతున్న అట్టడుగు వర్గాలైన దళితుల అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యా, వైద్య వ్యాపారాన్ని రద్దు చేయాలనీ, అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని పోరాడాలని కోరారు. ఏఐడీఆర్‌ఎం జాతీయ రెండో మహాసభలు హైదరాబాద్‌లో వచ్చే ఏడాది జనవరి ఐదు నుంచి ఏడో తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులకు కనీస రక్షణ కరువవుతున్నదని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక సుమారు రెండు లక్షల దాడులు జరిగినట్టు కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రకటించిందని గుర్తు చేశారు.