– జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ముద్ధిరెడ్డి కోదండ రెడ్డి
– డీఎస్‌ఆర్ గార్డెన్‌లో రైతు రుణమాఫీ సభ
– రైతులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ-యాచారం
దేశ చరిత్రలో పంట రుణమాఫీని చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. సోమవారం యాచారం మండల కేంద్రంలో ఉన్న డీఎస్‌ఆర్ గార్డెన్‌లో రైతు రుణమాఫీ సభ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గాంధీజీ, చాకలి ఐలమ్మ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి యాచారం సెంటర్‌లో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో పలువురి రైతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీని చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. రాష్ట్రంలో గత పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల పేరుతో రూ.7 కోట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టి పోయిందని ఆరోపించారు. బీజేపీ అధికారమున్న రాష్ట్రాల్లో ఎక్కడ రుణమాఫీని అమలు చేయలేదని చెప్పారు. రాబోయే రోజుల్లో ధరణి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో రైతుల సమస్యలు రెట్టింపు అయ్యాయని విమర్శించారు. ధరణిలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చూసేందుకు ప్రభుత్వ దష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆయన రైతులకు వివరించారు. ఆగస్టు 15 లోపట అర్హులైన రైతులందరికీ దపాల వారీగా రుణమాఫీని ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు భూమి సునీల్, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, ప్రవీణ్, జనార్ధన్, రంగారెడ్డి, దేంది రామిరెడ్డి, ఉప్పల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.