స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వొం

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వొం – నిరంకుశ, నియంతృత్వ పాలన పోయింది
– 25 గ్రామపంచాయతీ భవనాలు నిర్మించా:భారీ నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-మఠంపల్లి
గత ప్రభుత్వం దశాబ్ద కాలంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, అప్పుడు ప్రభుత్వం సహకరించకున్నా హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో 25 గ్రామపంచాయతీ భవనాలు నిర్మింపచేశానని భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రిఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ, నియంతృత్వ పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి, పాతదోనం బండ తండాల్లో సీఎస్‌ఆర్‌ నిధులతో ఒక్కో గ్రామపంచాయతీకి రూ.25 లక్షలతో గ్రామపంచాయతీ భవనాలు, రూ.13 లక్షలతో ఒక్కో అంగన్వాడీ భవనాలను, లాల్‌ తండాలో ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధులు రూ.20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల కోసం రూ.11.50లక్షలతో కావాల్సిన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకొచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లాపరిషత్‌లను నిర్వీర్యం చేసిందన్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సర్పంచుల కష్టాలు తీర్చాలని అంటున్నారని, వారిని కష్టాలపాలు చేసిందని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. సర్పంచులు ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని, ఉన్న ఆస్తులు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవరం లిఫ్టు పనిచేసేలా చూడాలని రైతులు కోరగా 15 రోజుల్లో పనిచేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సినీ నిర్మాత బండ్ల గణేష్‌, పంచాయతీరాజ్‌ ఎస్సీ రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ మంగ, ఎంపీడీవో జానకిరాములు, డీఎల్‌పీఓ శ్రీ రాములు, డీఎస్పీ ప్రకాష్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.