కోట్ల వర్షం కురిసేనా?

– మంగళవారం ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం
– వర్థమాన క్రికెటర్లపైనే ఫోకస్‌
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సందడి షురూ కానుంది. డిసెంబర్‌ 19న దుబారు వేదికగా ఐపీఎల్‌ 16 ఆటగాళ్ల మినీ వేలానికి రంగం సిద్ధమైంది. పది ప్రాంఛైజీలు 77 మంది క్రికెటర్లను (30 మంది విదేశీ క్రికెటర్లు) కొనుగోలు చేసేందుకు రూ.262.92 కోట్ల డబ్బుతో ప్రణాళికలు రూపొందించాయి. తొలిసారి ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం విదేశీ గడ్డపై జరుగుతుండగా.. ఓ మినీ వేలంలో ప్రాంఛైజీలు 31.58 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు ఖర్చు చేయనుండటం సైతం ఇదే ప్రథమం కానుంది.
ఐపీఎల్‌ వేలం అనగానే సహజంగానే ప్రపంచ శ్రేణి అత్యుత్తమ క్రికెటర్లపైనే ఫోకస్‌ ఉంటుంది. మ్యాచ్‌ ఫలితాన్ని ఒంటిచేత్తో శాసించగల ఆటగాళ్ల కోసం ప్రాంఛైజీలు ఎంత వరకైనా వెళ్లేందుకు వెనుకాడవు. ఈసారి మినీ వేలంలో సంప్రదాయానికి కాస్త భిన్నంగా.. దేశవాళీ వర్థమాన క్రికెటర్లపై ఫోకస్‌ కనిపించనుంది. పలు ప్రాంఛైజీలు యువ క్రికెటర్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడనున్నాయి. అటువంటి సత్తా ఉన్న దేశవాళీ అన్‌క్యాప్‌డ్‌ కుర్ర క్రికెటర్లు ఎవరో చూద్దాం.
అర్శిన్‌ కులకర్ణి : పేస్‌ ఆల్‌రౌండర్‌

దేశవాళీ సర్క్యూట్‌లో నాణ్యమైన పేస్‌ బౌలింగ్‌తో పాటు ధనాధన్‌ హిట్టింగ్‌ సామర్థ్యం కలిగిన ఆల్‌రౌండర్లు అరుదు. అటువంటి ఆటగాళ్లు అందుబాటులో ఉంటే ప్రాంఛైజీలు ఊరుకుంటాయా?!. ఈ కోవలోకి వచ్చే ఆటగాడు అర్శిన్‌ కులకర్ణి. వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతనిథ్యం వహించబోతున్న అర్శిన్‌.. ఈ ఏడాది మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో ఈగల్‌ నాసిక్‌ టైటాన్స్‌ తరఫున ఆకట్టుకున్నాడు. మహారాష్ట్ర తరఫున సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో అరంగ్రేటం చేసిన అర్శిన్‌ అక్కడా రాణించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ సిఫారసుతో చెన్నై సూపర్‌కింగ్స్‌ ట్రయల్స్‌కు హాజరు కావాల్సింది. కానీ ఆ సమయంలో అండర్‌-19 శిక్షణ శిబిరం ఉండటంతో వీలు పడలేదు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు పంజాబ్‌ కింగ్స్‌ అర్శిన్‌ కోసం వేలంలో పోటీపడే అవకాశం ఉంది.
శుభమ్‌ దూబే : యువ ఫినిషర్‌
అన్‌క్యాప్‌డ్‌ ఫినిషర్‌ సైతం దేశవాళీ క్రికెట్‌లో ఓ పట్టాన కనిపించరు. ఇక్కడే విదర్భకు చెందిన శుభమ్‌ దూబే ప్రతిభాన్వేషకుల దృష్టిలో పడ్డాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో శుభమ్‌ దూబే మంచి ప్రదర్శన చేశాడు. లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే శుభమ్‌.. 187.28 స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. ముస్తాక్‌ అలీ టోర్నీలో బెంగాల్‌తో మ్యాచ్‌లో 213 పరుగుల ఛేదన శుభమ్‌ ప్రత్యేకతను చాటింది. భారీ లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ముగించేశాడు శుభమ్‌. 20 బంతుల్లో అజేయంగా 58 పరుగులు చేశాడు. దూబే ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. దేశవాళీ హిట్టర్‌, ఫినిషర్‌ కోసం అన్వేషిస్తున్న ప్రాంఛైజీలు శుభమ్‌ దూబే కోసం వేలంలో పోటీపడనున్నాయి.
ముషీర్‌ ఖాన్‌ : స్పిన్‌ ఆల్‌రౌండర్‌
చాలా ఏండ్ల క్రితం.. ఓ ఎనిమిదేండ్ల బుడతడు భారత క్రికెట్‌ దిగ్గజం యువరాజ్‌ సింగ్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయ్యింది. బుడతడి ఆనందం కోసం యువీ వికెట్లను అప్పగించే అవకాశం లేకపోలేదు, అది వేరే సంగతి. కానీ బుడ్డోడు ఆ స్ఫూర్తి మరింత ముందుకు తీసుకెళ్లాడు. భారత క్రికెట్‌లో తనకంటూ ఓ స్థానం ఉండాలంటూ దూసుకొస్తున్నాడు. అతడే ముషీర్‌ ఖాన్‌. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా ముషీర్‌ సత్తా చాటాడు. భారత అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అనుభవం కలిగిన ఇద్దరు క్రికెటర్లలో ముషీర్‌ ఖాన్‌ ఒకడు. నిరుడు, కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో ముంబయిని ఫైనల్‌కు నడిపించిన ముషీర్‌.. 632 పరుగులు, 32 వికెట్లతో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు అందుకున్నాడు. ఈ ప్రదర్శన ముషీర్‌కు రంజీ జట్టులో చోటు దక్కేలా చేసింది. ముషీర్‌ ఖాన్‌ ఇప్పటివరకు మూడు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచులు ఆడాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనతో ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యతను తగ్గించినా.. ముషీర్‌ ఖాన్‌ బ్యాట్‌తో, బంతితో సమానంగా ప్రభావం చూపించగలడు. మంగళవారం వేలంలో ఈ లక్షణమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టనుంది.
సమీర్‌ రిజ్వి : బిగ్‌ హిట్టర్‌
20 ఏండ్ల సమీర్‌ రిజ్వి.. యూపీ టీ20 లీగ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. రెండు మెరుపు సెంచరీలు నమోదు చేసిన రిజ్వి.. టోర్నీలో 455 పరుగులు పిండుకున్నాడు. మినీ వేలానికి ముందు సమీర్‌ రిజ్వి మూడు ప్రాంఛైజీలకు ట్రయల్స్‌ ఇచ్చాడు. పంజాబ్‌ కింగ్స్‌ అందులో ఒకటి. యూపీ అండర్‌-23 జట్టు షెడ్యూల్‌తో కొన్ని ట్రయల్స్‌కు రిజ్వి దూరమయ్యాడు. కానీ.. అండర్‌-23 జట్టు తరఫున తన ఎంతటి ప్రమాదకర హిట్టరో ఓ టీజర్‌ వదిలాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 65 బంతుల్లోనే 91 పరుగుల ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఫైనల్లో 50 బంతుల్లో 80 పరుగులు చేసిన రిజ్వి యూపీ విజేతగా నిలువటంలో ముఖ్య భూమిక పోషించాడు. సమీర్‌ రిజ్వి టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సమీర్‌ కోసం సైతం వేలంలో ప్రాంఛైజీలు ఆసక్తి చూపనున్నాయి.
కుమార్‌ కుశాగ్ర : వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌
ఏ ఆటగాడి కెరీర్‌నైనా మలుపుతిప్పేందుకు ఒక గేమ్‌ చాలు. ఎంతో మంది స్టార్‌ క్రికెటర్ల విషయంలోనూ ఇది చూశాం. జార్ఖండ్‌కు చెందిన యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్ర ఆ కోవలోకే వస్తాడు. కోచ్‌లు, కెప్టెన్లను ఆకట్టుకునే రీతిలో గణాంకాలు, నిలకడ కుమార్‌లో లేవు. కానీ అవకాశం ఇచ్చి.. మద్దతు ఇస్తే అద్భుతాలు చేయగల సత్తా అతడి సొంతం. అటువంటి ఇన్నింగ్స్‌ ఒకటి విజరు హజారే టోర్నీలో ఆడాడు. మహారాష్ట్రపై 355 పరుగుల ఛేదనలో కుశాగ్ర ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 37 బంతుల్లో అజేయంగా 67 పరుగులు చేశాడు. అందులో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అసాధ్యం అనుకున్న టార్గెట్‌ను కుశాగ్ర మెరుపు బ్యాటింగ్‌తో సాధ్యం చేశాడు. జార్ఖండ్‌కు విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌కు ఐపీఎల్‌ ప్రాంఛైజీల ప్రతిభాన్వేషకులు సైతం హాజరు కావటం కుశాగ్రకు ప్లస్‌ పాయింట్‌. ఇషాన్‌ కిషన్‌ జాతీయ జట్టు తరఫున ఆడుతుండటంతో.. జార్ఖండ్‌కు కుశాగ్ర ఫస్ట్‌ చాయిస్‌ వికెట్‌ కీపర్‌గా మారాడు. కుమార్‌ నిలకడ సాధించాల్సి ఉంది.. అయినా అతడిలో విలువైన ప్రతిభ దాగి ఉంది. నాణ్యమైన వికెట్‌ కీపర్‌ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌లు కుశాగ్ర కోసం వేలంలో ఓ లుక్కేయవచ్చు!.