చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తే బాగుండు

– ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌
నవతెలంగాణ-తాంసి
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తే ఇంకా సంతోషంగా ఉండేదని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. బుధవారం తాంసి, భీంపూర్‌ మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. భీంపూర్‌ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో 30 చెక్కులను, తాంసి మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో 10 చెక్కులను జడ్పిటిసిలు, తహసీల్దార్లుతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి అద్భుతమైన పథకమని, ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో చెక్కుతో మాట తులం బంగారం ఇస్తామని చెప్పిన మాట ఇంత వరకు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. అనంతరం గిరిగాం గ్రామానికి చెందిన మాజీ మండల కన్వీనర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. నిపాని గ్రామానికి చెందిన యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మి, నారాయణరావు, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, జెడ్పిటిసిలు సుధాకర్‌, రాజు, మండలాల నాయకులు లస్మన్న, అనిల్‌, కృష్ణ,మహేందర్‌, గోవర్ధన్‌రెడ్డి, రఘు, రమణ, రజనీకాంత్‌, నరేందర్‌, నర్సింగ్‌ పాల్గొన్నారు.