కొండ రెడ్ల కు జీవనోపాధి కల్పించడమే ఐటీడీఏ లక్ష్యం: జేడీ ఎం హరిక్రిష్ణ

నవతెలంగాణ – అశ్వారావుపేట
సమాజంలో అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలు అయిన కొండ రెడ్లు,అటవీ ప్రాంత గిరిజన సమూహాలకు జీవనోపాధి కల్పించి వారి సమగ్ర అభివృద్ధికి పాటు పడటమే ఐటీడీఏ (ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ – సమీకృత గిరిజనాభివృద్ధి) లక్ష్యం అని జేడీ ఎం(ఉపాధి కల్పనా జిల్లా మేనేజర్ ) హరిక్రిష్ణ తెలిపారు. శనివారం మండలంలోని గోగులపుడి లో గల పీవీ టీజీ(పర్టికులర్ లీ వలన్రేబుల్ ట్రైబల్ గ్రూప్) కొండ రెడ్ల ఆవాసాన్ని ఆయన సందర్శించి స్థానిక వనరులతో హస్తకళలు, చేతివృత్తులతో ఉపాధి పొందే విషయాలపై అవగాహన కల్పించారు. ఇప్పటికే అక్కడ వెదురుతో గృహ అలంకరణ సామాగ్రి తయారు చేస్తున్న వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని చేతి వృత్తి ద్వారా ఉపాధి పొందాలని కోరారు.అలంకరణ వస్తువులు కు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉందని,ఉత్పత్తులు అధికం చేసి భద్రాచలం లాంటి పట్టణాల్లో విక్రయించడానికి అవకాశాలు మెండు గా ఉన్నాయని తెలిపారు. ఔత్సాహికులు ముందుకు వస్తే అగరబత్తీలు తయారీ యూనిట్ సమకూర్చుతామని,వేడుకలకు,వినోదాలకు ఉపయోగ పడే లైటింగ్ తో కూడిన డీజే సౌండ్ సిస్టం అందజేస్తామని వివరించారు.వీరివెంట స్థానిక కార్యదర్శి బింగి రామక్రిష్ణ ఉన్నారు.