– బెంచ్‌కు పరిమితం కావటంపై కుల్దీప్ యాదవ్
బ్రిడ్జ్‌టౌన్ (వెస్టిండీస్)
పిచ్ స్వభావం, పరిస్థితులు సహా తుది జట్టు కూర్పు కాంబినేషన్ల కోసం బెంచ్‌కు పరిమితం కావటం అలవాటైందని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 3 ఓవర్లలోనే నాలుగు వికెట్ల మాయజాల ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పరిస్థితులు, కూర్పు కారణంగా దక్కని అవకాశాలపై ఆవేదన చెందకుండా, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటమే నా లక్ష్యమని కుల్దీప్ అన్నాడు. తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన అనంతరం కుల్దీప్ యాదవ్ మాట్లాడాడు.
వికెట్ కాదు లెంగ్త్‌పైనే ధ్యాస
‘చాలా సందర్భాల్లో నాకు తుది జట్టులో చోటు దక్కదు. ఎందుకంటే పరిస్థితులు, కాంబినేషన్లు కుదరటం లేదు. ఇది నాకు మామూలు విషయంగా మారింది. నేను ఆరేండ్లుగా జట్టుకు ఆడుతున్నాను. ఇవన్నీ నాకు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా దృష్టి వికెట్ల వేటపై లేదు. ఏ లెంగ్త్‌లో ఏ లైన్‌లో బంతులు సంధించాలనే ప్రక్రియపైనే పూర్తి ఫోకస్ నిలిపాను. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత ఏడాదిన్నరగా మంచి లెంగ్త్‌లతో బౌలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. లెంగ్త్ విషయంలో ఎంతో నిలకడ సాధించాలని అనుకుంటున్నాను. వికెట్ల విషయానికొస్తే.. ఓ సారి దక్కుతాయి, మరోసారి నిరాశ ఎదురైతుంది. పరిస్థితులు సైతం ఎంతో కీలకం. ప్రత్యర్థి జట్టు వేగంగా 4-5 వికెట్లు చేజార్చుకున్నప్పుడు మాత్రమే వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నిస్తాను. భారత క్రికెట్‌లో పోటీతత్వం ఎప్పుడూ ఉంటుంది. చాహల్‌తో పోటీ నన్ను మరింత ప్రేరణకు గురి చేస్తుంది. నా వరకు ప్రక్రియ అత్యంత ప్రధానం. చాహల్‌కు, నాకు మంచి సమన్వయం ఉంది. కాంబినేషన్లు ముఖ్యమైనవి మాకు తెలుసు. నేను ఆడినప్పుడు ఉత్తమ ప్రదర్శన చేయాలని చాహల్ కోరుకుంటాడు. నేనూ అంతే. చాహల్ తుది జట్టులో నిలిచినప్పుడు నా అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకుంటాను. కుల్‌చా కాంబినేషన్ బాగా పని చేయడానికి మేమిద్దరం ఒకరికొకరు మద్దతుగా నిలువటమేనని’ కుల్దీప్ యాదవ్ అన్నాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్‌లో ఉన్న సమయంలో, ప్రస్తుతం జట్టులో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లి మద్దతు మైదానంలో మెరుగైన ప్రదర్శన చేయటంలో కీలక భూమిక పోషిందని కుల్దీప్ తెలిపాడు.