ఇది పిల్లల వసంత కాలం

ఇది పిల్లల వసంత కాలంప్రతి వేసవికాలం పిల్లలు తమని తాము నిర్మించుకోవడానికి, తమలో ఉన్న టాలెంట్‌, సజనాత్మకతను ఆటల ద్వారా నిరూపించుకునేందుకు వచ్చే ఒక గొప్ప అధ్బుతమైన అవకాశం. పిల్లలు బడిలో పుస్తకాలు, ఇంట్లో తల్లిదండ్రులు నేర్పలేని జీవితం పాఠాల్ని ఆటల ద్వారానే నేర్చుకుంటారు.
క్రమ’శిక్ష’ణ పేరిట పిల్లల్ని గదిలో బంధించకండి. ప్రపంచాన్ని, ప్రకతిని దర్శించుకొనివ్వండి. అక్కడే వారి సంపూర్ణ వ్యక్తిత్వం రూపుదిద్దుకోబడుతుంది.
ఆడుకోవడం ద్వారా ఒంటరితనం నుంచి బయటపడి నలుగురిలో కలవడం ఇష్టపడతారు.
ఆటల ద్వారానే పిల్లలు పడటం, లేవడం, ఓడిపోవడం, గెలవడం నేర్చుకుంటారు. ఓడిపోతే గుణపాఠాలు నేర్చుకుంటారు. గెలుపొటములు శాశ్వతం కాదని అర్థం చేసుకుంటారు. గెలపు అనేది కేవలం వ్యక్తిగతం కాదు అది సాముహిక విజయమని గ్రహిస్తారు.
ఆటల్లో గొడవలు పడటం, తర్వాత క్షమాపణలు చెప్పటం నేర్చుకుంటారు. గొడవల తర్వాత కూడా కలిసి ఉండటం అలవాటు చేసుకుంటారు.
ఆటల ద్వారా అందరికీ ఒకే రకమైన శక్తి సామర్థ్యాలు ఉండవని తెలుసుకుంటారు. తమ బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకునే మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారు.
పది మందిలో కలిసి ఆడుకోవడం వల్ల నాయకత్వం లక్షణాలు మెరుగు దిద్దుకుంటాయి. భిన్నాభిప్రాయాలను స్వీకరించడం, వాటిని విశ్లేషించడం ఒక ఏకాభిప్రాయానికి రావడం నేర్చుకుంటారు.
సైకాలజీలో చిన్న పిల్లలపై జరిగిన పరిశోధనలు ఆటల్లో ఉండే పిల్లలతో పోలిస్తే ఆటలకు దూరంగా ఉన్న పిల్లల్లో కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ వంటి లక్షణాలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి.
పరిశోధనల ప్రకారం బాల్యంలో ఆటలకు దగ్గరగా ఉన్న పిల్లలు పెద్దయ్యాక వచ్చే ఇబ్బందులు చాలా సులభంగా అధిగమిస్తారని, దానితో పాటు వారికి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా తెలుపుతున్నాయి.
అమెరికాన్‌ సైకాలజికల్‌ అస్సోసియేషన్‌ జరిపిన పరిశోధనల్లో ఆరుబయట ఆడుకునే పిల్లలతో పోలిస్తే ఇంటర్నెట్‌ గేమ్స్‌ ఆడుకునే పిల్లల్లో నేర స్వభావం ఎక్కువగా వుందని తేలింది.
ఆటల ద్వారా పిల్లల్లో సజనాత్మక ఆలోచనలు, ఏకాగ్రత, విశ్లేషణ, జ్ఞాపక శక్తి, కమ్యునికేషన్‌ స్కిల్స్‌, సమస్యను విభిన్న కోణాల్లో అర్థం చేసుకునే మానసిక శక్తి, పోటీని ఎదుర్కోవడం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుంది.
మొత్తంగా ఆటల ద్వారా పిల్లల్లో శారీరక దఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందుతుంది.
వేసవికాలంలో పిల్లలతో చేయించాల్సినవి :
అలవాట్లు: 1. డ్రాయింగ్‌, పెయింటింగ్‌ 2. సింగింగ్‌ 3. నత్యం 4. స్విమ్మింగ్‌ 5. స్టోరీ బుక్స్‌ 6. పజిల్స్‌
ఆటలు: 1. క్రికెట్‌, 2. చెస్‌, 3. వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, 4. కరాటే, 5. క్యారం బోర్డు, 6. ఫుట్‌బాల్‌, 7. ఆర్చరీ, 8. జిమ్నాస్టిక్స్‌, 9. హాకీ 10. బ్యాడ్మింటన్‌.
పిల్లలకు మంచి అలవాట్లను నేర్పకపోవడం, వాటిలో ఉన్న ఆనందాన్ని పరిచయం చేయకపోవడం వల్లనే చెడు అలవాట్లకు ఆకర్షితులవుతారు. కాబట్టి మీ పిల్లల్లో ఏదైనా మానసిక సమస్యలు గానీ అడిక్షన్‌ లేదా బిహేవియర్‌ ప్రాబ్లమ్స్‌ కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఒక మంచి సైకాలజిస్టుని సంప్రదించి కౌన్సెలింగ్‌, థెరపీ తీసుకోవాలి.
హరిష్‌ ఆజాద్‌ (సైకాలజిస్ట్‌)
7382173741