నవీపేట్ సంతల వేలంకు వేళాయే ..

– రాష్ట్రంలోనే మేకల సంతకు ప్రత్యేకత..

– మేకల సంత వేలంతోనే పంచాయతీకి ఆదాయం..
– ప్రత్యేక అధికారుల పాలనలో పారదర్శకంగా వేలం జరిగేనా?
– ప్రజా ప్రతినిధుల పాలనలో నిబంధనలు నీళ్లపాలు!
– నష్టపోతున్న వ్యాపారస్తులు, కొనుగోలుదారులు..
– ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా!
– ప్రత్యేక అధికారులు ప్రత్యేకత చూపెట్టేనా?
నవతెలంగాణ – నవీపేట్
తెలంగాణ రాష్ట్రంలోనే నవీపేట్ మేకల సంతకు ప్రత్యేకత ఉంది. మేకల సంతకు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి సైతం క్రయవిక్రయదారులు వేల సంఖ్యలో హాజరవుతారు. ప్రతి శనివారం కోట్ల రూపాయల్లో లావాదేవీల నిర్వహణతో తెలంగాణలోనే అతిపెద్ద మేకల సంతగా పేరుగాంచింది. అటువంటి మేకల సంతకు మంగళవారం రోజు వేలంపాట నిర్వహిస్తుండడంతో ఈసారైనా ప్రత్యేక అధికారుల పాలనలో పారదర్శకంగా నిర్వహించి గ్రామపంచాయతీ ఆదాయాన్ని ఘననీయంగా పెంచుతారా.. లేదా సిండికేటుగాళ్లకు సరెండర్ అవుతారా అని సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
నిబంధనలు నీళ్లపాలు: ప్రజా సేవకు అంకితం అవుతామని గొప్పలు చెప్పుకుని ప్రజల ఓట్లు దండుకొనే ప్రజా ప్రతినిధులు నవీపేట్ గ్రామపంచాయతీకి ఆదాయం సమకూర్చడంతో పాటు క్రయవిక్రయదారులకు సంత వేలం పాట నిబంధనలు అమలు చేయాల్సి ఉండగా నీళ్ల పాలు చేసి కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే ఆదాయం సమకూరేలా అడ్జస్ట్మెంట్ అవుతున్నారు. గత సంవత్సరం మేకల సంతకు సిండికేట్ కాకుండా కొంతమంది యువకులు పంచాయతీ పాలకవర్గాన్ని ప్రశ్నించి అధికారులపై సైతం ఒత్తిడి తీసుకువచ్చి వేలం పాటను 55 లక్షలకు పలకడంతో గ్రామపంచాయతీ ఆదాయం ఘననీయంగా పెరిగింది. కానీ వేలంపాట నిబంధనైన మేక, వాహనాలకు మరియు కూరగాయల వ్యాపారులకు సంబంధించిన రేట్ల పట్టికను సంతలో అమర్చకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి వ్యాపారస్తులపై బలవంతపు వసూళ్లకు పాల్పడి లక్షల రూపాయలు అర్జిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈసారైనా ప్రత్యేక అధికారుల పాలనలో వేలం పాట నిబంధనాలను కచ్చితంగా పాటించాలని స్థానిక యువకులు మరియు వ్యాపారస్తులు కోరుతున్నారు.
లక్షలు ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్న: గ్రామ పంచాయతీకి గత సంవత్సరం మేకల సంతకు 55 లక్షలు, వారాంతపు, రోజు వారి సంతకు 14 లక్షలు ఆదాయం వచ్చిన సంత ప్రాంతంలో వ్యాపారస్తులకు వినియోగదారులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగునీరు, నీడ సౌకర్యాలతో పాటు వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉంచాల్సిన గత పంచాయతీ పాలక వర్గాలు కేవలం ఆదాయపు వనరులుగా మాత్రమే సంతలను చూస్తుండడంతో ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారైనా ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరచూపి సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు.