తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి : జె.వెంకటేశ్‌

– ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం,డైరెక్టర్‌ శ్రీనివాసాచారికి వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయంలో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్న 24 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడం సరిగాదనీ, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఈ మేరకు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం డైరెక్టర్‌ శ్రీనివాసాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ.. పాత కాంట్రాక్టు గడువు ముగిసిందనే కారణంతో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కార్మికులను విధుల్లోకి అనుమతించట్లేదన్నారు. దీంతో మూడు నెలలుగా ఉద్యోగం, జీతాలు లేక ఆ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయని డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలనీ, చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎం.వెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌. ఈశ్వర్‌బాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నటరాజ్‌ పాల్గొన్నారు.