దేవనకొండ : కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటం తీవ్రమౌతోంది. దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్‌లో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక విధాలుగా నిరసన తెలిపినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరుల్లో మార్పు రాకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన 12 గ్రామాల ప్రజలు శుక్రవారం పెద్దఎత్తున కదిలారు. యురేనియం తవ్వకాలతో వచ్చే సమస్యలను చర్చించారు. భావి తరాలకు శాపంగా మారే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి)ని ఏర్పాటుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు జెఎసి ఆధ్వర్యంలో పోరాడతామని ప్రకటించారు.
కౌలుట్ల స్వామి దేవాలయం ఆవరణలో శుక్రవారం ఉదయం ఈ సమావేశం జరిగింది. కప్పట్రాళ్ల, ఈదుల దేవరబండ, నెల్లిబండ, కోటకొండ దుప్పనగుర్తి, జిల్లేడు బుడకల, చెల్లెలచెలిమెల, బండపల్లి, బంటుపల్లి, బేతపల్లి గ్రామాల ప్రజలు వివిధ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలకతీతంగా యురేనియం తవ్వకాల జెఎసిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిపి రామచంద్ర నాయుడు, ఆస్పరి మాజీ జడ్‌పిటిసి బొజ్జమ్మ, టిడిపి మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, టిడిపి నాయకులు కప్పట్రాళ్ల మల్లికార్జున, మల్లేపల్లి రంగడు, వెంకటస్వామిగౌడ్, సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో యురేనియం కోసం 68 బోర్ల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. యురేనియం తవ్వకాల వల్ల భారీగా నష్టం వాటిల్లుతుందని, అడవి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోగాల బారిన పడతారని చెప్పారు. పచ్చని పొలాలు బీళ్లుగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాలు ఆపకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వైసిపి నాయకులు దివాకర్ నాయుడుతో పాటు
కప్పట్రాళ్ల, కోటకొండ, బేతపల్లి, చెల్లెల చెలిమెల, బంటుపల్లి కి చెందిన సర్పంచులు చెన్నమనాయుడు, తిమ్మక్క, మహేశ్వర్ రెడ్డి, చిన్నరామప్ప, సూర్యప్రకాష్, సీపీఐ(ఎం) నాయకులు కోటకొండ సూరి, యూసుఫ్ బాష తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2017లో కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో ఎనిమిది చోట్ల తవ్వకాలు జరిపి యురేనియం నిక్షేపాలను నిర్ధారించారు. ఆ తరువాత 17 ఎకరాల్లో బోర్లు తవ్వేందుకు అటామిక్ మినరల్ డైరక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చి సంస్థ ప్రతిపాదనలు పంపింది. దీంతో గ్రామస్తులు ఆందోళనలకు దిగారు.