రికార్డు ముంగిట జకో

– నేడు రూడ్‌తో టైటిల్‌ పోరు
సెర్బియా యోధుడు, 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత నొవాక్‌ జకోవిచ్‌ (35) నేడు అరుదైన రికార్డుల ముంగిట నిలిచాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో నేడు కాస్పర్‌ రూడ్‌ (నార్వే)తో జకోవిచ్‌ తలపడనున్నాడు. స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌తో సమవుజ్జీగా 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సొంతం చేసుకున్న జకోవిచ్‌.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు సాధించిన మెన్స్‌ ప్లేయర్‌గా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను రెండు సార్లు గెల్చుకున్న జకోవిచ్‌.. ఆదివారం నాటి ఫైనల్లో విజయం సాధిస్తే టెన్నిస్‌ చరిత్రలోనే నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలను (ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌, వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌) కనీసం మూడుసార్లు ముద్దాడిన ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. నార్వే కుర్రాడు కాస్పర్‌ రూడ్‌ కెరీర్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ వేటలో నిలిచాడు. నిరుడు రొలాండ్‌ గారోస్‌లో ఫైనల్స్‌లో పరాజయం పాలైన కాస్పర్‌ రూడ్‌.. మరోసారి అక్కడే కెరీర్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ కోసం సిద్ధమవుతున్నాడు. మూడో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ వరుసగా 21 గ్రాండ్‌స్లామ్‌ విజయాలతో జోరుమీదున్నాడు. టాప్‌ సీడ్‌ కార్లోస్‌ అల్కరాజ్‌తో సెమీఫైనల్లో… జకోవిచ్‌ టెక్నికల్‌, ఫిజికల్‌, స్ట్రాటజికల్‌ సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు.
జకోవిచ్‌పై విజయం సాధించేందుకు కాస్పర్‌ రూడ్‌కు ఒక్కటే మార్గం ఉంది!. టైటిల్‌ పోరుకు ఐదు సెట్లకు దారితీస్తే జకోవిచ్‌ను నిలువరించటం కష్టసాధ్యం. తొలి మూడు సెట్లలోనే జకోవిచ్‌కు చెక్‌ పెట్టగలిగితేనే కాస్పర్‌ రూడ్‌ తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ అందుకోగలడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మొనగాడు రఫెల్‌ నాదల్‌ లేనివేళ ఇక్కడ మరో టైటిల్‌ సాధించాలనే జకోవిచ్‌ సంకల్పాన్ని కాస్పర్‌ రూడ్‌ భగం చేయగలడా? ఆసక్తికరం. నొవాక్‌ జకోవిచ్‌, కాస్పర్‌ రూడ్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నేడు సాయంత్రం 6 గంటలకు ఆరంభం కానుంది. సోనీ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌ ప్రసారం అవుతుంది.