హైదరాబాద్: ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో రూ.1.10 కోట్లు దక్కించుకుని సంచలనం సృష్టించిన 13 ఏండ్ల బిహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అభినందించారు. ఉప్పల్ స్టేడియంలోని తన కార్యాలయంలో జగన్‌మోహన్ రావును విజరు హజారే ట్రోఫీ కోసం ఇక్కడకు వచ్చిన బిహార్ జట్టు మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాద్ వర్థమాన క్రికెటర్లు వైభవ్‌ను ఆదర్శంగా తీసుకుని పాఠశాల స్థాయి నుంచే రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పారు. బిహార్ కెప్టెన్ షకిబల్ గని, వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ బిపిన్ సౌరబ్ సహా ఇతర క్రికెటర్లను జగన్‌మోహన్‌రావు సన్మానించారు. హెచ్‌సీఏ సీఈవో సునీల్, సీఎఫ్‌సీ క్రికెట్ అకాడమీ మెంటార్ కె. భరణి కార్యక్రమంలో పాల్గొన్నారు.