జగన్‌ నాకు సోదరుడిలాంటోడు

జగన్‌ నాకు సోదరుడిలాంటోడు– ఈ ఎన్నికల్లో ఆయనే గెలుస్తారు
– పోలింగ్‌ స్టేషన్ల వద్ద జనరేటర్లు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు సోదరుడి లాంటోడనీ, ఈ ఎన్నికల్లో ఆయనే గెలుస్తాడని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ హాల్‌లో ఓటేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో అనేక సవాళ్లతో కూడుకున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని గుర్తు చేశారు. పోయిన లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామనే నమ్మకముందన్నారు. పోటీ చేసిన ప్రతిపార్టీ తామే గెలుస్తామంటుంది, కానీ.. ఆ గెలుపును ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. పోలింగ్‌ స్టేషన్ల దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురేసి చొప్పున అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల్లో ప్రభుత్వం ఒక్క గ్యారెంటీనే సగం సగం అమలు చేసిందని దెప్పిపొడిచారు.
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికైనా తాను సీఎంనని గుర్తించాలని హితవు పలికారు. ప్రభుత్వ పనితీరుపై ఆయన దృష్టి పెట్టాలని సూచించారు. కరెంటు కోతలు, నీటి కొరతల వంటి అసలైన సమస్యలపైన దృష్టి సారించాలన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పైన ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోడీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలన్నారు.నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో ఆయన రాష్ట్రాలకు మధ్య వివక్ష చూపారని విమర్శించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఇన్వర్టర్లు, జనరేటర్లు, క్యాండిల్స్‌, పవర్‌ బ్యాంకులు, చార్జింగ్‌ లైట్లు, ఇవే కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలని ఎద్దేవా చేశారు.