చింటు అప్పుడే బడి నుండి ఇంటికచ్చిండు. గవర్నమెంట్ బడిలో నాలుగో తరగతి చదువుతున్నడు. బక్క పల్చని పిల్లగాడు.
”అవ్వా..ఏమన్నా తినేటియి ఉన్నాయానే”!!
రోజు బడి నుంచి వచ్చి రాంగనే తల్లిని చింటు అడిగే మొదటి మాట అది.
”కాళ్ళు చేతులు మొకం కడుక్కొని రాపో బిడ్డా”
భుజానికున్న పుస్తకాల బ్యాగు తీసుకుంట అన్నది తల్లి లచ్చవ్వ. వానికి ఆ మాటలు ఎంతో ఉషారిచ్చినయి. అంటే అవ్వ ఇప్పుడు తనకేదో తినడానికి ఇస్తదన్న మాట. ఈలేసుకుంట రయ్యి మని బాత్రూం కాడికి వురికి ఆదరబాదరగా కడుక్కొనచ్చి తల్లి ముందు నిలబడ్డడు. ఆమె చేతుల గుండ్రగా.. పసుపు పచ్చగా మెరిసిపోతూ… ఓ.. తియ్యని లడ్డు. దాన్ని చూడగానే ”బాయిల నీళ్ల ఊట” మాదిరి ఒకటే నోరూరింది వాడికి. అస్సొంటీ లడ్డూలు ఎప్పుడో గాని దొరుకవు మరి! అవ్వ చేతుల నుండి గబుక్కున దాన్ని అందుకొని ఆవురావురమంటూ క్షణంల మాయం చేసిండు.
”అరె…అరె… మెల్లగ తిను బిడ్డా.. కుతికే పడతది” అనుకుంట కొడుక్కు గ్లాసుల మంచినీల్లిచ్చింది లచ్చవ్వ.
”అబ్బ!! ఎంత మంచిగున్నదే! ఎవరిచ్చిండ్లు అవ్వా!!”
పెదాలని నాలికతో తడుపుకుంట అన్నడు.
”మన ఇంటి పక్కున్న రామక్కకు ఇయ్యాల సీమంతం చేసి ఒడి నింపిండ్లు. ఆడ ఇచ్చిండ్లు”
”ఒక్కటే ఇచ్చిండ్లానే… ఇంకేం ఇయ్యలేదా!!” ఆరా తీసిండు. ఇంకో లడ్డు వుంటే బాగుండు అన్పించింది తనకి.
”ఇచ్చెటోల్లు పది ఇస్తర్రా.. సరే సరే ఇగ లడ్డు ముచ్చట ఆపి ముందుగాల బువ్వ తిను”
అనుకుంట పళ్ళెంల అన్నం చారు పోసుకచ్చి కలిపి వాని ముందు పెట్టింది.. నిజానికి ఇంకో రెండు సకినాలు, మడుగులున్నయి. వాటిని ఒక్క ముక్కగూడ సుంచి నోట్లేసుకోకుండ రేపు వానికే ఇయ్యచ్చని డబ్బాల చీమలు పట్టకుండ దాచింది. ఎందుకంటే రోజూ బడి నుంచి రాంగనే ఏమన్నా తీనేటీయి వున్నయానే అని పాణం దీస్తడు మరి!
చింటు అన్నం ముందు కూసున్నడు గని వాని మనుసుల లడ్డచ్చి కూసున్నది. ఇగ ఏం జేసుడు! ఇంకోటి తింటే బాగుండు… ఊహు కాదు.. కాదు… రెండు.. మూడు… నాలుగు… ఇంక శాన లడ్డూలు తినాలనిపిస్తాంది. బువ్వ తినకుండ ఆలోచించుకుంట కంచంల లడ్డు బొమ్మ గీస్తున్నడు. ఓరకంట తల్లి ఇదంతా చూస్తనే వుంది.
”ఏందిరా తినకుండ కంచంల గీతలు గీయబడితివి”
వాడి మనసుల ఓ ఆలోచన తట్టింది. అంతే.. దాన్ని పట్టుకొని అవ్వ మాటతో ఈ లోకంల కచ్చిండు. అడగానా వద్దా అనుకుంట ఏనుక ముందాడి….
”నువ్వు గూడ మనింట్ల గిస్సొంటియి చెయ్యారాదే” అన్నడు టక్కున.
ఆ మాటిని గతుక్కుమ్మన్నది లచ్చవ్వ.
”లడ్డు సల్లగుండ పోరనికి ఊకేనన్న ఇత్తిని… ఇగ లడ్డూ లడ్డునీ నా పానం తినెటట్టున్నడు” అనుకుంది మనసుల చిరాగ్గా.
”మాగ సాల్తీయి… ఏది సూత్తే అది అడుగుతరా ఎవలైన!!.. ఐన తీపి బాగ తినద్దు పడిశం పడుతది కొడుకా… ముచ్చట ఆపి దబ దబ తిను నాకు ఆకలైతాంది” అని కొడుకును వేగిర పెట్టింది. అవ్వ మాటినీ బువ్వ తింటే లడ్డూలు చేస్తది కావచ్చని తీపి తిన్న నోటీతో పుల్లపుల్లగా వున్న చారు బువ్వను ”మందు గోలి” మింగినట్టు బలవంతంగా మింగిండు. పళ్లెం కాలి చేసి…
”అవ్వ చూసినవానే… నువ్వు చెప్పినట్టు బువ్వంత తిన్న మరి లడ్డూలు చెయ్యరాదు” అంటూ మళ్ళీ అదే పాట అందుకున్నడు. ఆ మాటలేవి పట్టించుకోకుండ లచ్చవ్వ గిన్నెల మిగిలిన అన్నం కొడుకు తిన్న పళ్ళెంల వేసుకొని ఇంత చారు కలుపుకొని గబగబ నాలుగు మెతుకులు తిని కంచం ముందు నుండి లేసింది. పొద్దటి నుండి ఒకటే నడం గుంజుడు… నొప్పి. ఓపికలేక మూలకున్న నులక మంచల నడుం వాల్చింది.
లచ్చవ్వను చూస్తే నలభై ఏళ్ల మనిషనుకుంటరు. నిజానికి ఆమెకు ముప్పై ఏళ్ళు. రెండేళ్ల క్రితం వరకు తెల్లని ఒంటి రంగు, కోల మొకంతో కళకళలాడేది. ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో బతుకు మీద ఆశ కనిపించేవి ఆమెలో. కానీ వాటన్నిటిని నిర్దయగా దోచుకెల్లి తనను ఒంటరిని చేసి కాన రాని లోకాలకు వెళ్లిపోయిండు ఆమె భర్త లచ్చులు. తీయ్య తియ్యటి వూసులెన్నో చెప్పి తాగుడు ఊబిలో దిగి ప్రాణాలు వదిలిండు.
రెండొందల గడప గల చిన్న వూరు వాళ్ళది. అక్కడ నీళ్లకు మాత్రమే కరువు. కానీ అన్నీ కాలాల్లో గుడుంబా ఏరులై పారుతుది. దాంట్ల మునిగి శానా మంది పానాలు వదిలిండ్లు. చిన్న వయసులో భర్తలను కోల్పోయిన చాలా మంది మహిళల్లో లచ్చవ్వ ఒకతి. చెరువుల, కుంటుల నీళ్ల వుంటే వ్యవసాయం నడుస్తది. ఆమెకు కూలీ పని దొరుకుతది. వర్షాకాల కావడంతో ఇప్పుడు వారి నాట్ల పని జోరందుకుంది. గుత్తకూల్లకు పోతోంది. నాలుగు పైసలు దొరుకుతయి అనీ వారం సంది ఒంట్లె ఓ పక్కంత గుంజుతూ.. భరించలేనినొప్పి లేసిన నాట్లకు పోవుడు మానలే.. డాక్టర్ దగ్గరికి పోతే ఏవో మందులు రాసిండు. పట్నం బోయి పెద్ద దావకాన్ల టెస్టులు చేసుకోవాలన్నడు. మరి పైసలేవి!!.. మొగడు తాగి తాగి లివర్ ఖరాబు చేసుకొని సావు బతుకుల మధ్య వుంటే ఎట్లన్న చేసి వాని పానాలు కాపాడాలని మహిళా గ్రూప్లో లక్ష రూపాయల అప్పు వడ్డీకి తెచ్చింది. పోయేటోడు పోక అప్పునీ వురితాడుల ఆమె మెడకు బిగించిపోయిండు. ఉప్పిడి ఉపాసం వుంటు నెలకు మూడు వేల రూపాయల వడ్డీ కడుతాంది. లేకుంటే ఇజ్జత్ పోతది. అది పోయినంక ఇగ బతుకుడు దండుగ అనుకుంటది లచ్చవ్వ. వితంతు పించన్, ఇన్ని రేషన్ బియ్యం, ఎప్పుడన్నా దొరికే కూలి… వీటితోనే రోజులు గడువాలే. ఎత్తిన నడుం దించకుండా నాట్లేస్తుంటే నడుం విరిగినంత పనైతాంది. కారు చీకటి లాంటి తన బతుకులో కాంతి రేఖలా ఉదయించిన కొడుకును ప్రాణంగా చూసుకుంట తన కష్టమంతా మర్చిపోతది.
చాలా సేపటి నుండి తనను పట్టించుకుంటలేదనీ పడుకొన్న తల్లి దగ్గరికొచ్చి చెవి దగ్గర మెల్లగా.. ”అవ్వా లడ్డూలు గావలే… ఎపుడు చేస్తవ్” అన్నడు మల్ల.
అసలే సమస్యల సముద్రంలో మునిగి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆమెకు కొడుకు లడ్డు నస చిరాకు తెప్పించింది. ఐన ఓపికతో…
”శాన ఖర్చు ఐతది కొడుకా… పప్పు, చక్కెర, నూనెకు అంతకల్పి ఎంతలేదన్నా మూడొందల పైనే కావాలే… ఎప్పుడన్న పైసలున్నప్పుడు చేసుకుందాం తీయి”..
కొడుకు మీద చెయ్యి వేసి బుజ్జగించింది. డబ్బాల రేపటికనీ దాచిన సకినాలు మడుగులు తెచ్చి ఇచ్చింది. అట్లనన్న వూకుంటడనుకొంది.
వాటిని కొరికి.. చీ.. చీ.. ఇవి వద్దు లడ్డూలే కావాలే అనుకుంట వాటిని కింద విసిరి కొట్టి వచ్చీరాని ఏడుపు అందుకొన్నడు. మంచంల అటూఇటూ బొర్లిండు. నిద్రపోతేనన్న కొంచెం ఒళ్ళునొప్పులు తగ్గుతయి అనుకుంటే పోరడు ఎంత చెప్పిన ఇనకుండ ఆగమాగం చెయ్యబట్టే… తినకుండా దాచినయి నేల పాలు చీసేకదా అని సర్రున కోపం వచ్చివాని వీపు మీద దభి దభీ గట్టిగ నాలుగు దెబ్బలు వేసింది లచ్చవ్వ.
”పిస మొకపోడా!! తినేటియి విసిరి కొడుతావ్… ఒకసారి చెపితే అర్థం కాదా.. ఇప్పుడు రాత్రి అయింది. నోర్మూసుకొని పడుకో” అంటు భద్రకాళిలా గర్జించింది. అమ్మో!! తల్లిని అంత కోపంలో ఎప్పుడూ చూడలేదు వాడు. నిక్కర్ల పాస్ పోసుకున్నంత పనైంది వాడికి. ఒక్కసారిగా భయంతో బెదిరిపోయిండు. వీపు చురుక్కుమనడంతో కిక్కురు మనకుండ అటు తిరిగి పడుకున్నడు. ఈసారి వాడికి మాత్రం నిజంగనే ఏడుపు తన్నుకొచ్చింది. అవ్వ మల్ల ఏడ కొడతదో అని వెక్కిళ్ళ మధ్య ఏడుపును ఉగ్గ బట్టుకున్నడు. వెక్కుతూ అట్లనే నిద్రలోకి జారుకున్నడు. ఆలోచనల సుడి గుండంలో చిక్కుకున్న లచ్చవ్వకు ఎంతోసేపటికో గానీ తాను ఏం చేసిందో అర్థం కాలేదు. పిల్లి కూన లెక్కన అటు తిరిగి ముడుచుకొని పడుకొన్న కొడుకును జాలిగా చూసి ”అయ్యో… పోరన్ని వట్టి వట్టిగనే అంత గట్టిగ కొడితి” అనుకుంట ఆత్రంగా కొడుకు అంగి పైకి లేపి చూసి షాక్ తిన్నది. వాడి తెల్లని బక్కపెయ్యి మీద తన కుడి చేతి వేళ్ళు ఐదుకు ఐదు అచ్చులు పడి ఎర్రగా వాతలు తేలినయి. వాటిని చూడంగనే ఆమెకు అమాంతం దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళ నుండి జలజలా కన్నీళ్లు రాలుతుండగా… చేతులతో తలను బాదుకుంట…
”అయ్యో.. నా చేతులు పడిపోను… వాటికి జెట్టలు పుట్టా… పసిగుడ్డు.. అయ్యలేనోడు.. గీ తీరుగా కోడితి… కొట్టడానికి నాకు చేతులేట్లచ్చే!! నా చేతులకు చెట్లు మొలువా”!! అనుకుంట కొడుకు వీపు నిమురుకుంట వెక్కి వెక్కి ఏడ్చింది లచ్చవ్వ. వాని తలను తన ఒడిలో పెట్టుకొని రాత్రంతా చాలా సేపు అట్లనే కూర్చుండిపోయింది.
మరుసటి రోజు లచ్చవ్వ కూలికి రానని చెప్పింది. బువ్వ కూర వండి కొడుక్కి తినిపించి బడికి పంపింది. శేరు రేషన్ బియ్యం యాకుబ్ గిండ్రి కాడికి తీసుకుపోయి పిండి పట్టించుక వచ్చింది. వచ్చేటప్పుడు దార్లో కొమిటి శంకరయ్య దుకాణంల అరకిలో బెల్లం కొన్నది. మధ్యాన్నం కొద్దిసేపు నడుం వాల్చినట్టు చేసింది. కొడుకు బడి నుండి వచ్చే టైంకు పొయ్యి మీద గిన్నెలో కొన్ని నీళ్లు పోసి వేడి చేసింది. అరకిలంత బియ్యప్పిండి తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో పోసి కాసింత ఉప్పేసి కల్పింది. ఆ పిండిని బాగ పిసికి ముద్దలు చేసింది. చేతులకు కొంచెం పొడి పిండి రాసుకొని పిండి ముద్దను చేతుల్ల తీసుకొని గుండ్రని రొట్టెలు చేసింది. రొట్టె అంచులు చిట్లకుండ పల్లెం బోర్లించి దానిపై పొడి పిండి చల్లి ఈ రొట్టేలు వేసి అంచులు అధ్ధింది. ఆ రొట్టెలను పేనం మీద వేసి తడి బట్ట ముక్కతో వాటి మీద రుద్దుతూ అటూఇటూ తిప్పి కాల్చింది. అట్లా ఆరు రొట్టెలు చేసి అవి వేడి మీద వుండగానే వాటిని చిన్న చిన్న రొట్టెముక్కలగా చేసింది. అంతకు ముందే మెత్తగా దంచిన బెల్లాన్ని ఈ రొట్టెముక్కలకు కల్పి ముద్దలు చేసింది.రొట్టెల వేడికి బెల్లం కరిగి రొట్టముక్కలకు అంటుకు పోయి ముద్ద ఆకారం లోకి వచ్చినయి. ముద్దలోని రొట్టెముక్కలను కొన్ని నోట్లో వేసుకొని తప్తిగా తల వూపింది లచ్చవ్వ. పిసికిన ముద్దలన్ని గిన్నెలపెట్టి బయటికొచ్చి గుడిసె ముందు నిలబడి కొడుకు కోసం ఆరాటంగా ఎదురు చూడసాగింది.
చింటు పుస్తకాల బ్యాగుతో బడి నుండే రానే వచ్చిండు. తల్లి సంబరంగా వానికి ఎదురెళ్లి కొడుకును దగ్గరకు తీసుకొని బ్యాగు అందుకొంది. ఈ టైంల వాడి నోటి నుండి వచ్చే మాట కోసం చెవులారా ఎదురు చూసింది. కానీ వాడు ”అవ్వా… ఏమాన్న తీనేటియి వున్నాయానే” అసలు అననేలేదు. ఒక్క క్షణం ఆ తల్లి చెవులు చిన్న బుచ్చుకున్నయి. కానీ ఆమె హదయం మాత్రం ఏం పర్లేదు అంటు ఓదార్చింది. కొడుకును పోయి కాళ్ళు కడుక్కొని రమ్మంది. బాత్రూమ్ దిక్కు వెళుతున్న కొడుకును చూస్తూ..
”నిన్న నేను కొట్టింది యాదిల వుంచుకున్నట్టున్నడు”. చేసిన తెలివి తక్కువ పనికి మరోసారి తనను తాను తిట్టుకుంది. కొద్ది సేపటికి వచ్చి తన ముందు కూసున్న కొడుక్కి పళ్ళెంలో మూడు ముద్దలు పెట్టీ చేతికిచ్చింది. వాటిని కొంచెం సేపు ఆశ్చర్యంగా చూసి ఒక ముద్దను చేతిల పట్టుకొని..
”ఏంటిదే అవ్వా ఇది” అన్నడు.
”బెల్లంలడ్డు కొడుకా.. తిను..” అంది లచ్ఛవ్వ.
ఆమె గుండె లబలబమంటు కొట్టుకుంటోంది. కొడుక్కది నచ్చుతదో లేదో అని. కళ్ళింత చేసుకొని వాడి వంకే కన్నార్పకుండా చూడసాగింది. వాడు ముద్దను నోట్లో పెట్టుకొని టక్కున కొరికిండు. అంతే… ఒక్కసారిగా కమ్మని తియ్యదనం.. అమ్మ ప్రేమంతా కమ్మదనం తో వాడి నోరంతా నిండిపోయింది. ఆ రొట్టెముక్కలు నములుతుంటే వాటికి అంటుకుపోయిన చిన్న చిన్న బెల్లం ముక్కలు పంటి కింద పడి నలుగుతున్నయి. ఆ నలిగనయి నాలిక మీదికి జారి వాడికి చెప్పలేనంత తీపిరుచిని ఇస్తున్నయి. అరే.. అరే.. ఇవి నిన్నటి లడ్డూల కంటే తియ్యగున్నయే అనుకున్నడు కళ్ళు మూసుకొని నములుకుంట. ఒకటి… రెండు… మూడు… తల్లి చేతికిచ్చుడు వాడు కళ్ళు మూసుకొని తినుడు. చూస్తుండగానే పళ్ళెం కాలి చేసి నెమ్మదిగా కళ్ళు తెరిచిండు. అమాయకంగా, అయోమయంగా తన వైపు చూస్తున్న తల్లి మొకంలో మొకం పెట్టీ వాడి చూపుడు వేలు బొటనవేలు రెండు కలిపి లడ్డూల గుండ్రంగా చుట్టి..
”నీ బెల్లం లడ్డు సూపర్ గున్నదే. ఇంకో రెండు లడ్డూలియ్యీ అవ్వా… ఎప్పుడూ ఇట్లనే చెయ్యి” అన్నడు గట్టిగా మెరిసే కళ్ళతో. తల్లి బుగ్గపై ముద్దు పెట్టకున్నడు మురిపెంగా.
కొడుకు ”మెచ్చుకోలు” తో ఆమెకు ఏనుగు ఎక్కినంత ఆనందం కలిగింది.
”హమ్మయ్య వాడికి నచ్చింది… తనకది చాలు”అనుకుంది
పొద్దటి నుండి బెల్లం లడ్డు కోసం పడిన కష్టం, కొడుకు సంతోషం కోసం పడ్డ తపన అంతా దూదిపింజలా తేలిపోయింది. మనసంతా హాయిగున్నది. వాడిని దగ్గరకు తీసుకుంటూ నీ కిష్టమైన నీ బెల్లం లడ్డు పై ఆన… ఇగ నిన్ను ఇంకెప్పుడు కొట్టను బిడ్డా అనుకొన్నది మనసుల గట్టిగ.
చింటు మాత్రం ఇక అప్పటి నుండి తల్లి ఏ రొట్టె (బియ్యం, గోధుమ, జొన్న) చేసిన దానికి బెల్లం కల్పి లడ్డూలు చెయ్యాల్సిందే. ఎందుకంటే వాడికి ప్రతి రొట్టెల ”బెల్లం లడ్డు” కన్పిస్తది మరి!.
భాస్కరాచారి కశివోజ్వల
7396016164