– బాధ్యతలు చేపట్టిన
– అమిత్ షా తనయుడు
దుబాయ్ : కేంద్ర హోంశాఖ మంత్రి కుమారుడు, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఆదివారం నుంచి ఐసీసీలో సరికొత్త శకాన్ని మొదలుపెట్టాడు. 36 ఏండ్ల జై షా.. డిసెంబర్ 1న ఐసీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ‘ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఐసీసీ డైరెక్టర్లు, సభ్య దేశాల మద్దతుకు ధన్యవాదాలు. లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండబోతున్న తరుణంలో బాధ్యతలు చేపట్టడం ఉత్సాహంగా ఉంది. అందరి సహకారంతో ఆటను పురోగతి బాటలో నడిపించేందుకు కృషి చేస్తానని’ జై షా తెలిపారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, ఐసీసీ ఫైనాన్స్-కమర్షియల్ అఫైర్స్ కమిటీ చైర్మన్‌గా జై షా పని చేశారు.
ఐసీసీ చైర్మన్‌గా జై షా తొలి వారంలోనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ప్రస్తుతం పీటముడి నెలకొంది. టోర్నమెంట్ పూర్తిగా పాకిస్థాన్‌లో జరగాలని పీసీబీ పట్టుబడుతోండగా.. భారత్ మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు మొగ్గుచూపిస్తుంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదంలో ఉన్న పీసీబీ.. హైబ్రిడ్ మోడల్‌లో భారత మ్యాచ్‌లను దుబారు లేదా ఇతర తటస్థ వేదికపై నిర్వహించేందుకు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ అంశంపై పూర్తి స్పష్టత రానుంది.