శ్రీలంక క్రికెట్లో జై షా పెత్తనం?

శ్రీలంక క్రికెట్లో జై షా పెత్తనం?– లంక దిగ్గజం అర్జున రణతుంగ విమర్శలు
నవతెలంగాణ-ముంబయి
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అగ్రనేత, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా ప్రపంచ క్రికెట్లో అనుచిత జోక్యం చేసుకునే స్థాయికి చేరుకున్నారు!. అధికార పార్టీ, ప్రభుత్వం ఆశీస్సులతో వరుసగా రెండోసారి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జై షా..ఆసియా క్రికెట్‌ కమిటీ (ఏసీసీ) చైర్మెన్‌గా సైతం కొనసాగుతున్నారు. 2023 ఐసీసీ ప్రపంచకప్‌లో దారుణ వైఫల్యంతో శ్రీలంక క్రికెట్‌లో ముసలం పుట్టింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌బి)ను ఆ దేశ క్రీడాశాఖ మంత్రి రద్దు చేశారు. మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ నాయకత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. క్రీడాశాఖ ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేసి, శ్రీలంక క్రికెట్‌ బోర్డును కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైదానంలో జట్టు పేలవ ప్రదర్శన, మైదానం వెలుపల అడ్మినిస్ట్రేషన్‌ సంక్షోభం ద్వీప దేశం క్రికెట్‌ బోర్డును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ క్లిష్ట తరుణంలో ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) వేటు వేసింది. దీంతో శ్రీలంక క్రికెట్‌ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై ఐసీసీ వేటు వెనుక అమిత్‌ షా తనయుడు జై షా ఉన్నాడని, శ్రీలంక క్రికెట్‌ను శాసించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడని అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు.
రణతుంగ ఏమన్నాడంటే..
‘ భారత్‌లో ఓ కుటుంబ ప్రోద్బలంతో బలమైన స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి మరో దేశం క్రికెట్‌ బోర్డు తలరాత, వ్యవహారాలను ప్రభావితం చేస్తున్నాడు. ప్రపంచ క్రికెట్‌ వ్యవస్థ, పనితీరుకు ఇదో నిదర్శనం. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు’ అని ది డైలీ మిర్రర్‌ పత్రికతో అర్జున రణతుంగ వ్యాఖ్యానించారు. అమిత్‌ షా తనయుడు జై షాను ఉద్దేశించి రణతుంగ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ రూల్స్‌ను అడ్డుపెట్టుకుని శ్రీలంక క్రికెట్‌ను అమిత్‌ షా నడిపిస్తున్నాడని ఆయన విమర్శలు గుప్పించారు.
గతంలోనూ..
భారత క్రికెట్‌ ఆఫీస్‌ బేరర్లుగా కొనసాగిన బిజెపి నాయకులు గతంలోనూ ఐసీసీని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నం చేశారు. జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసులు అమలు చేస్తే ఐసీసీ నుంచి సస్పెన్షన్‌ ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని ఓ లేఖ ఇవ్వాలని అప్పటికి బోర్డు అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఐసీసీ చైర్మెన్‌ శశాంక్‌ మనోహర్‌ను కోరారు. అందుకు శశాంక్‌ మనోహర్‌ నిరాకరించగా.. కోర్టు ధిక్కరణ కేసులో అధ్యక్ష, కార్యదర్శి పదవులకు అనురాగ్‌ ఠాకూర్‌, అజరు షిర్కే దూరమయ్యారు. 2018లో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను భారత సుప్రీంకోర్టు నేరుగా తొలగించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది స్వతంత్ర క్రికెట్‌ సంస్థలో జోక్యమే. అయినా, ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు అంశంలో మాత్రం ఐసీసీ అనూహ్యంగా స్పందించింది. న్యాయస్థానం క్రీడాశాఖ ఆదేశాలను నిలుపదల చేసినా.. ప్రభుత్వ జోక్యం అంటూ ఐసీసీ కొరఢా ఝులిపించింది. ఐసీసీ చర్యల వెనుక జై షా ఉన్నారనే శ్రీలంక క్రికెట్‌ బోర్డు బలంగా విశ్వసిస్తోంది.