న్యూయార్క్ : ఆసియా భవితవ్యానికి భారత్-చైనా సంబంధాలు చాలా కీలకమైనవని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కేవలం ఆసియానే కాకుండా యావత్ ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగలవని అన్నారు. అయితే ఇరు దేశాలు సమాంతరంగా ఎదగడమనేది ఈనాటి అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా కొత్త సమస్యను తెచ్చి పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. వంద కోట్లకు పైగా జనాభా కలిగిన దేశాలు ఈ రెండు మాత్రమేనని ఆ రకంగా ఇవి విశిష్టతను కలిగివున్నాయని అన్నారు. అలాగే రెండు దేశాలు అంతర్జాతీయంగా ఎదుగుతున్నాయన్నారు. ఉమ్మడి సరిహద్దును కలిగివున్న ఇరుగు పొరుగు దేశాలని అన్నారు. ”ఇండియా, ఆసియా, వరల్డ్’ అనే శీర్షికతో ఆసియా సొసైటీ, ఆసియా సొసైటీ పాలసీ ఇనిస్టిట్యూట్‌లు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశాల్లో జై శంకర్ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు.