తెలంగాణ రాష్ట్ర సాకారంలో జైపాల్‌రెడ్డి పాత్ర మరువలేనిది

– సీఎం రేవంత్‌రెడ్డి
– కేంద్ర మాజీమంత్రికి నివాళ్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణ యోధుడు, ఉత్తమ పార్లమెంటేరియన్‌, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి జయంతి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో జైపాల్‌రెడ్డి పోషించిన పాత్ర ప్రజలెప్పుడూ మరిచిపోరని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ప్రజల మనోభావాలను కేంద్రానికి వివరించి సఫలీకతుడైన నాయకుడు జైపాల్‌రెడ్డి అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాధన కోసం నిశ్శబ్ద సైనికుడిలా జైపాల్‌రెడ్డి పనిచేశారన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయం చేసి అత్యంత కీలకపాత్ర పోషించిన మట్టిబిడ్డ అని కొనియాడారు. తెలంగాణ పల్లె నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన జైపాల్‌ రెడ్డి దేశంలో అరుదైన రాజకీయవేత్త అని ప్రశంసించారు. రాజకీయాల్లో నిష్కళంక నేతగా, విలువలకు ప్రతీకగా ఆయన నిలిచారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ్యుడిగా లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, విపక్ష నేతగా, కేంద్ర మంత్రిగా నిర్వహించిన అనేక పదవులకు జైపాల్‌ రెడ్డి వన్నె తెచ్చారని అన్నారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ కామన్‌ మినిమం ప్రోగ్రామ్‌(సీఎంపీ)ని రూపొందించడం ద్వారా దేశ ప్రాధాన్యాలను గుర్తించిన నాయకుడని శ్లాఘించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంతానికి నీరివ్వాలని మొట్టమొదట తలచిన నాయకుడు జైపాల్‌రెడ్డి అని గుర్తుచేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి జైపాల్‌రెడ్డి పునాదులు వేశారని చెప్పారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఇటీవల మంత్రిమండలి తీర్మానించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్‌ మెట్రో రైలు మంజూరైందన్నారు. విలువలతో జీవితాంతం ప్రజాసేవకే అంకితమైన జైపాల్‌రెడ్డి జయంతిని గురువారం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ తరుణంలో వారి ఆశయాలు, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడంలో ప్రతిఒక్కరూ పాటుపడాలని సీఎం పిలుపునిచ్చారు.