– నాల్గో టీ20లో భారత్ ఘన విజయం
– 2-2తో సిరీస్ సమం చేసిన హార్దిక్ సేన
యువ బ్యాటర్లు వీరంగం చేశారు. యశస్వి జైస్వాల్ (84 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (77) భారీ అర్థ సెంచరీలతో దండయాత్ర చేయగా నాల్గో టీ20లో ఆతిథ్య వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఓపెనర్ల విశ్వరూపంతో 179 పరుగుల లక్ష్యాన్ని హార్దిక్‌సేన 17 ఓవర్లలోనే ఊదేసి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
నవతెలంగాణ-లాడర్‌హిల్
యశస్వి జైస్వాల్ (84 నాటౌట్, 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (77, 47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌లతో పరుగుల మోత మోగించారు. 179 పరుగుల ఛేదనలో యువ ఓపెనర్లు తొలి వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయటంతో టీమ్ ఇండియా అలవోకగా విజయం సాధించింది. మరో 18 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. షిమ్రోన్ హిట్‌మయర్ (61, 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారు హోప్ (45, 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
కుల్దీప్ మాయ : కుల్దీప్ యాదవ్ (2/28) మాయజాలంతో వెస్టిండీస్ తొలుత 178 పరుగులే చేసింది. బ్యాటింగ్ పిచ్‌పై భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. పేసర్ అర్షదీప్ సింగ్ (3/38) సైతం మెరువటంతో 123/7తో వెస్టిండీస్ కష్టాల్లో కూరుకుంది. కానీ ఆరంభంలో షారు హోప్ (45), చివర్లో హిట్‌మయర్ (61) విండీస్‌ను ఆదుకున్నారు. తొలి మూడు మ్యాచుల్లో విఫలమైన హిట్‌మయర్.. లాడర్‌హిల్‌లో మెరిశాడు. నాలుగు సిక్సర్లు, మూడు సిక్సర్లతో 35 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. డెత్ ఓవర్లతో ధనాధన్ మెరుపులతో వెస్టిండీస్ మెరుగైన స్కోరు సాధించింది.
ఓపెనర్లే ఊదేశారు! : కరీబియన్ టూర్‌లో నిలకడగా బ్యాటర్లు విఫలం కావటం, లాడర్‌హిల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు తక్కువగా ఉండటంతో భారత్‌పై కాస్త ఒత్తిడి కనిపించింది. కానీ కెరీర్ రెండో టీ20 ఆడుతున్న యశస్వి జైస్వాల్ (84 నాటౌట్) ఆరంభం నుంచీ బౌండరీల మోత మోగించాడు. శుభ్‌మన్ గిల్ మరో ఎండ్‌లో ఆచితూచి ఆడగా.. జైస్వాల్ దండయాత్ర చేశాడు. కాస్త సమయం తీసుకున్న తర్వాత గిల్ సైతం దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. పోటాపోటీగా బౌండరీలు బాదిన గిల్, యశస్వి తొలి వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. గిల్ 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో 30 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా, జైస్వాల్ 9 ఫోర్లతో 33 బంతుల్లో తొలి పిఫ్టీ అందుకున్నాడు. చివర్లో గిల్ నిష్క్రమించినా.. తెలుగు తేజం తిలక్ వర్మ (7 నాటౌట్) తోడుగా యశస్వి జైస్వాల్ లాంఛనం ముగించాడు.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 178/8 (హిట్‌మయర్ 61, హోప్ 45, అర్షదీప్ 3/38, కుల్దీప్ 2/28)
భారత్ ఇన్నింగ్స్ : 179/1 (యశస్వి జైస్వాల్ 84, శుభ్‌మన్ గిల్ 77, షెఫర్డ్ 1/35)
నేడు సిరీస్ డిసైడర్
భారత్, వెస్టిండీస్ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ నేడే. తొలి రెండు మ్యాచుల్లో విండీస్, తర్వాతి రెండు మ్యాచుల్లో భారత్ నెగ్గటంతో నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో సిరీస్ ఫలితం తేలనుంది. హార్దిక్ సారథ్యంలో 4 సిరీస్‌లు ఆడిన భారత్ నాలుగింటా గెలుపొందింది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం.