– అజేయ అర్థ సెంచరీలు బాదిన ఓపెనర్లు
– పేస్ దళపతి బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన
– భారత్ రెండో ఇన్నింగ్స్ 172/0
– ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 104/10
బ్యాటర్ల వైఫల్యంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ డిఫెన్స్‌ను మొదలెట్టిన టీమ్ ఇండియా.. పేసర్ల ప్రతాపానికి, ఓపెనర్ల మెరుపులు జతకలవటంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పట్టు బిగించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (90 బ్యాటింగ్), కెఎల్ రాహుల్ (62 బ్యాటింగ్) అజేయ అర్థ సెంచరీలతో కదం తొక్కారు. క్రికెట్ పుస్తకాల్లోని మౌళిక సూత్రాలు పాటిస్తూ, సహనంతో బ్యాటింగ్ చేసిన జైస్వాల్, రాహుల్ భారత్ ఆధిక్యాన్ని 200 పరుగుల మార్క్ దాటించారు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా (5/30) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు కుప్పకూలింది. భారత్ 46 పరుగుల విలువైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.
నవతెలంగాణ-పెర్త్
యశస్వి జైస్వాల్ (90 బ్యాటింగ్, 193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (62 బ్యాటింగ్, 153 బంతుల్లో 4 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. పిచ్ నెమ్మదిగా పేస్ నుంచి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుండగా.. భారత ఓపెనర్లు ఆసీస్ బౌలర్లను ఆడుకున్నారు. రెండో రోజు ఆటలో రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. 57 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లు వికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ (26, 112 బంతుల్లో 2 ఫోర్లు), అలెక్స్ కేరీ (21, 31 బంతుల్లో 3 ఫోర్లు) ఆసీస్‌కు మూడెంకల స్కోరు అందించారు. భారత కెప్టెన్ జశ్‌ప్రీత్ బుమ్రా (5/30) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 218 పరుగుల ముందంజలో కొనసాగుతోంది. తొలి రోజు ఆటలో ఏకంగా 17 వికెట్లు పతనం అవగా.. రెండో రోజు ఆటలో కేవలం మూడు వికెట్లు పడ్డాయి.
యశస్వి, రాహుల్ షో
తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల విలువైన ఆధిక్యం సాధించిన టీమ్ ఇండియాను ఓపెనర్లు తమదైన ఇన్నింగ్స్‌లతో తిరుగులేని స్థానంలో నిలబెట్టారు!. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ నుంచి పాఠం నేర్చుకున్న యశస్వి జైస్వాల్ బంతిని బలంగా బాదేందుకు చూడలేదు. క్రీజులో నిలబడి వికెట్ల మధ్య పరుగుపై ఫోకస్ పెట్టాడు. నెమ్మదిగా ఒక్కో పరుగూ జోడించిన జైస్వాల్.. 123 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. జైస్వాల్ కెరీర్‌లో ఇదే అత్యంత నెమ్మదైన అర్థ సెంచరీ. కమిన్స్‌పై ట్రేడ్‌మార్క్ అప్పర్‌కట్, స్టార్క్‌పై డీప్ స్క్వేర్‌లెగ్‌లో బౌండరీ, లయాన్ ఓవర్లో క్రీజు వదిలి సంధించిన సిక్సర్ యశస్వి ఇన్నింగ్స్‌లో హైలైట్. కెఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్ జోరు కొనసాగించాడు. వివాదాస్పద డీఆర్‌ఎస్ నిర్ణయానికి బలైన రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో అదే క్లాస్ చూపించాడు. ఏమాత్రం దూకుడు చూపకుండా అద్భుతంగా ఆడాడు. వేగంగా పరుగులు రాబట్టిన యశస్వికి మరో ఎండ్ నుంచి చక్కని సహకారం అందించాడు. మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్‌ను ఎదుర్కొనేందుకు జైస్వాల్ క్రీజు లోపల నిలబడి బంతులను ఎదుర్కొన్నాడు. రాహుల్, యశస్వి తొలి వికెట్‌కు అజేయంగా 172 పరుగులు జోడించారు.
ఆస్ట్రేలియా పేసర్లు తొలి రోజు జోరు పునరావతం చేయలేకపోయారు. కెప్టెన్ పాట్ కమిన్స్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. జోశ్ హాజిల్‌వుడ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అతడిపై పరుగుల వేట కష్టమైంది. నిలకడగా బ్యాటర్లపై ఒత్తిడి పెంచినా.. వికెట్ మాత్రం పడలేదు. నాథన్ లయాన్ వ్యూహం ఫలించలేదు. జైస్వాల్‌ను ఊరించే ప్రయత్నంలో పరుగులు సమర్పించుకున్నారు కానీ విజయవంతం కాలేదు. ట్రావిశ్ హెడ్, లబుషేక్‌కు బంతి అందించినా ఉపయోగం లేదు. జైస్వాల్ 51 పరుగుల వద్ద ఉండగా స్లిప్స్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ఉస్మాన్ ఖవాజా అందుకోలేదు. ఆ తర్వాతి బంతికే కెఎల్ రాహుల్ రనౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఒకట్రెండు సార్లు ఓపెనర్ల మధ్య కమ్యూనికేషన్ లోపించినా.. వెంటనే రాహుల్, జైస్వాల్ సరిచేసుకున్నారు. క్రీజులో ఎంతో సమయంతో బ్యాటింగ్ చేశారు. లంచ్ సెషన్లో 26 ఓవర్లలో 84 పరుగులు చేసిన ఈ జోడీ.. టీ సెషన్లో 31 ఓవర్లలో 88 పరుగులు సాధించారు.
బుమ్రాకు ఐదు వికెట్లు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు కుప్పకూలింది. బుమ్రా బూమ్‌బూమ్ ప్రదర్శనతో ఏ దశలోనూ 100 పరుగులు చేసేలా కనిపించని కంగారూలు.. టెయిలెండర్ల మెరుపులతో మూడెంకల స్కోరు అందుకుంది. 79/9తో భారత్ చేతిలో అత్యల్ప స్కోరుకు పరిమితం అయ్యాలే కనిపించిన ఆసీస్ (1981 మెల్‌బోర్న్ టెస్టులో భారత్ చేతిలో 83కు ఆలౌట్) స్టార్క్ అండతో బతికిపోయింది. హాజిల్‌వుడ్ (7)తో కలిసి 26 పరుగులు జోడించిన స్టార్క్ (26) ఆకట్టుకున్నాడు. అలెక్స్ కేరీ (21) వికెట్‌తో బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేశాడు. ఆసియా ఆవల బుమ్రాకు ఇది 11వ ఐదు వికెట్ల ప్రదర్శన. 51.2 ఓవర్లలో ఆసీస్ 104 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సాధించింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 150/10
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : ఉస్మాన్ ఖవాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8, మెక్‌స్వీనీ (ఎల్బీ) బుమ్రా 10, లబుషేన్ (ఎల్బీ) సిరాజ్ 2, స్మిత్ (ఎల్బీ) బుమ్రా 0, హెడ్ (బి) రానా 11, మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6, అలెక్స్ కేరీ (సి) పంత్ (బి) బుమ్రా 21, కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3, స్టార్క్ (సి) పంత్ (బి) రానా 26, లయాన్ (సి) రాహుల్ (బి) రానా 5, హాజిల్‌వుడ్ నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (51.2 ఓవర్లలో ఆలౌట్) 104.
వికెట్ల పతనం : 1-14, 2-19, 3-19, 4-31, 5-38, 6-47, 7-59, 8-70, 9-79, 10-104.
బౌలింగ్ : జశ్‌ప్రీత్ బుమ్రా 18-6-30-5, మహ్మద్ సిరాజ్ 13-7-20-2, హర్షిత్ రానా 15.2-3-48-3, నితీశ్ కుమార్ రెడ్డి 3-0-4-0, వాషింగ్టన్ సుందర్ 2-1-1-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ 90, కెఎల్ రాహుల్ బ్యాటింగ్ 62, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 172.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 12-2-43-0, జోశ్ హాజిల్‌వుడ్ 10-5-9-0, పాట్ కమిన్స్ 13-2-44-0, మిచెల్ మార్ష్ 6-0-27-0, నాథన్ లయాన్ 13-3-28-0, లబుషేన్ 2-0-2-0, ట్రావిశ్ హెడ్ 1-0-8-0.