జలశక్తి అభియాన్ పనులు బాగున్నాయి..

– సంతృప్తి వ్యక్తం చేసిన జాయింట్ సెక్రెటరీ వేద విర్ ఆర్య
– వనమహోత్సవంలో పాల్గొన్న కేంద్ర బృందం.. పనుల  తనిఖీ
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ జిల్లాలో జలశక్తి అభియాన్ పనులు బాగుండడం పట్ల కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ వేద వీర్ ఆర్య  సంతృప్తి వ్యక్తం చేశారు.  జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ పనుల పరిశీలన నిమిత్తం మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి అభియాన్ జాయింట్ సెక్రటరీ బృందం శాస్త్రవేత్త దివాకర్ మహంతాతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తో సమావేశమైంది.ఈ సందర్భంగా జల శక్తి అభియాన్ పథకం కింద నల్గొండ జిల్లాలో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. జిల్లాలో జలశక్తి అభియాన్ పనులను ఇంకా పెద్ద ఎత్తున చేపడుతామని,100 శాతం పనులను విజయవంతం చేస్తామని జిల్లా కలెక్టర్  తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా జల శక్తి అభియాన్ పై డిఆర్డిఏ నాగిరెడ్డి వివరించగా, తాగునీటి అంశాలపై ఆర్డబ్ల్యూఎస్ ఈ వెంకటేశ్వర్లు,వ్యవసాయ శాఖ పై జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉద్యాన అంశాలపై జిల్లా హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి వివరించారు.అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో కేంద్ర బృందం పాల్గొంది.
అనంతరం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కలు, నర్సరీ, మ్యాజిక్  సోక్  పిట్లు,కమ్యూనిటి సోక్  పిట్లు,ఓపెన్ వెల్స్ ను కేంద్ర బృందం పరిశీలించింది. అలాగే డిసిల్టింగ్ ,అమృథ్ సరోవర్, ఫిష్ పాండ్ ల ను తనిఖీ చేసింది. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లేములలో బృహత్ పల్లె ప్రకృతి వనాలను పరిశీలించింది. కురిసిన ప్రతి నీటిబొట్టును భూమిలో ఇంకింపజేయాలన్న సంకల్పంతో కేంద్ర  ప్రభుత్వం జల శక్తి అభియాన్ పథకం తీసుకువచ్చింది. జలశక్తి అభియాన్ కింద  దేశవ్యాప్తంగా 151 జిల్లాలలో పనులు చేపట్టనుండగా నల్గొండ జిల్లా  సైతం ఈ పథకానికి ఎంపికైంది. 2019 నుండి జిల్లాలో ఈ పథకం కింద పనులు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా పనుల సక్రమ నిర్వహణ తీరును పరిశీలించేందుకు బృందం  జిల్లాకు వచ్చింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ బృందం శనివారం దేవరకొండ ప్రాంతంలో నీటి నిల్వ కట్టడాలను పరిశీలించనుంది. ప్రత్యేకించి చెక్ డ్యాములు, ఊట కుంటలు, గల్లి కంట్రోల్స్ తదితర వాటిని ఈ బృందం పరిశీలిస్తుంది.  ఈ కార్యక్రమాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.