రాజ్యాంగ రూపకల్పన 75వ వార్షికోత్సవ సందర్భంగా దాన్ని రక్షించే విషయమై బీజేపీ నేతలు ఉపన్యాసాలు దట్టించిన రెండు రోజులలోపే మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని దాంట్లోని సమాఖ్య వ్యవస్థనూ దెబ్బ తీసేందుకు ఒక రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఇందుకోసం రెండు బిల్లులు సభలో ప్రవేశ పెట్టారు. ఒకటి రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు. లోక్‌సభకూ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలకు జమిలిగా ఎన్నికలు జరిపించాలని ఈ బిల్లులు ప్రతిపాది స్తున్నాయి.రాజ్యాంగ సవరణ బిల్లు మూడు అధికరణాలను సవరించి ఒక కొత్త నిబంధనను రాజ్యాంగంలో ప్రవేశ పెడుతుంది. లోక్‌సభకూ అన్ని రాష్ట్రాల శాసనసభలకు జమిలిగా ఎన్నికలు జరిపించేందుకై మార్గం సుగమం చేయడమే వీటి ఉద్దేశం. ఇందుకోసం రాజ్యాంగం లోక్‌సభకూ రాష్ట్రాల శాసనసభలకు ఇచ్చిన అయిదేండ్ల కాలవ్యవధిని తీసివేయడం జరుగుతుంది.
కీలకమైన తప్పులు
మొదటి విషయం అన్ని రాష్ట్రాల శాసనసభలకు అయిదేండ్ల కాల పరిమితి ముగియగానే రాష్ట్రపతి ప్రకటించిన తేదీ ప్రకారం లోక్‌సభతో పాటు ఏకకాలంలో ఎన్నికలు జరిగేవిధంగా ఒకే సమయా నికి తీసుకురా వాలంటే అన్నీ ఏక కాలంలో ఎన్నికలు జరిగేవిధంగా కాల వ్యవధినీ లోక్‌సభ అయిదేళ్ల గడువుతోపాటే ముగించాలి. అందుకోసం కొన్ని శాసనసభల అయిదేండ్ల కాలవ్యవధి ఏకకాలంలో ఎన్నికలు జరిగేవిధంగా ముందుగానే ముగిసేలా కుదించేయాలి. అయిదేండ్ల పదవీ కాలానికి ఎన్నికైన రాష్ట్రాల శాసనసభలపై ఇది మొదటి వేటు.
మరో విషయం-లోక్‌సభకూ లేదా రాష్ట్రాల శాసనసభలకు ఇస్తున్న రాజ్యాంగం అయిదేండ్ల పదవీ కాలానికి ఇకపై గ్యారంటీ ఏమీ వుండదు. లోక్‌సభ అయిదేండ్ల పదవీ కాలానికి ముందే రద్దయిపోయేట్టయితే తదుపరి లోక్‌సభ మిగిలిన పరిశేష పదవీకాలానికి మాత్రమే ఎన్నిక జరుగుతుందని ఒక సవరణ చెబుతున్నది. అంటే లోక్‌సభ అయిదేండ్ల పదవీ కాలానికి ముందే రద్దయిపోయేట్టయితే తదుపరి లోక్‌సభ మిగిలిన రెండేళ్ల పదవీ కాలం మాత్రమే ఉనికిలో వుంటుంది. రాష్ట్రాల శాసనసభల విషయంలోనూ ఇదే విధమైన సవరణ తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర శాసనసభ మధ్యలోనే రద్దయిపోతే అప్పుడు మిగిలిన పరిశేష పదవీ కాలానికి మాత్రమే ఎన్నిక జరుగుతుంది. ఉదాహరణకు ఒక రాష్ట్ర శాసనసభ మూడేండ్లకే రద్దయిపోతే అప్పుడు మిగిలిన పదవీ కాలానికి అంటే రెండేండ్లకు మాత్రమే ఎన్నిక జరుగుతుంది. అందువల్ల ఎన్నికైన పార్లమెంటు లేదా శాసనసభ్యుడికి పూర్తి అయిదేండ్ల పదవీ కాలం వుండదు. ఇది రాజ్యాంగం నిర్దేశించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య మౌలిక నిర్మాణానికే వ్యతిరేకం.
సమాఖ్యతత్వానికి చేటు
ఈ విధంగా రాష్ట్ర శాసనసభ కాల వ్యవధిని ముక్కలు చేయడం సమాఖ్య విధానంపైనా ఎన్నికైన సభ్యుల హక్కులపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శాసనసభల అయిదేళ్ల పదవీ కాలం అనే ప్రాథమిక హక్కునే ఛిద్రం చేయడంతో రాష్ట్రాల సమాఖ్యలో ప్రతిబింబించే సమాఖ్య (ఫెడరల్) చట్రం బలహీనమైపోతుంది. అంతేగాక కేంద్రంలోని ప్రభుత్వం, పాలించే పార్టీ కుయుక్తులకు తలుపులు తీసినట్టవుతుంది. ఉదాహరణకు ఒక రాష్ట్ర ప్రభుత్వ పతనం వల్ల ఆ శాసనసభ నాలుగేండ్ల పదవీ కాలం తర్వాత రద్దయిపోతే మిగిలిన ఒక్క ఏడాది కోసమే శాసనసభ ఎన్నిక జరపడం అర్థరహిత మవుతుంది. దీనివల్ల ప్రభుత్వం పడిపోకుండా బేరసారాలు జరపడం, లేదంటే రాష్ట్రపతి పాలన విధింపును ఆహ్వానించడమే అవుతుంది. ఫెడరలిజం అంటే అంతరార్థం వైవిధ్య భరితమైన భిన్నత్వంతో కూడిన భాషా సాంస్కృతిక పరిస్థితులనూ రాజకీయ బహుళత్వాన్ని గుర్తించడమే. లోక్‌సభ ఎన్నికలతో అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలనూ బ్రహ్మముడి వేయడమంటే ఒకే కేంద్రీకృత వ్యవస్థలో వాటన్నిటిని నిర్బంధంగా బిగించడమే అవుతుంది.
నిజంగా ఖర్చు తగ్గేనా?
వేర్వేరు సమయాల్లో వచ్చే రకరకాల ఎన్నికల వల్ల వఅథా అవుతున్న ఖర్చును తగ్గిస్తుందనేది ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపా దకులు ముందుకు తెస్తున్న ఒక ప్రధానమైన వాదన. అయితే ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టుగా లోక్‌సభ ఎన్నికలతో అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలనూ కలగలిపే సవరణ వల్ల స్వల్ప వ్యవధిలోనే అనవసరంగా ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.ఇప్పుడు ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ అయిదేండ్ల కాలానికి ఎన్నికవుతుంది. ఆ ప్రభుత్వం పడిపోతే మిగిలిన పదవీ కాలానికి ఎన్నిక జరుగుతుంది. ఫలితమేమంటే అయిదేండ్లలో మిగిలిన కాలం గడచిపోగానే మరో ఎన్నిక వస్తుంది. అంటే అయిదేళ్ల కాలంలో మూడు ఎన్నికలు జరపాల్సి వుంటుంది. ఇదే గనక లోక్‌సభ స్థాయిలో జరిగేట్టయితే దేశ వ్యాపితంగా అయిదేండ్ల కాలంలో మూడుసార్లు ఎన్నికలు జరపాల్సి వుంటుంది. ఇలాంటి అర్థ రహితమైన పరిస్థితి ఎన్నికల ఖర్చును అనేక రెట్లు పెరగడానికే దారితీస్తుంది.
ఇ.సికి ఏకపక్ష అధికారం
ఎన్నికల కమిషన్ గనక ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యంగా జరపాలని భావిస్తే అందుకు అధికారమిచ్చే మరో నిబంధన కూడా ప్రవేశపెట్టిన సవరణలో వుంది. ఎన్నికల కమిషన్ సిఫార్సును రాష్ట్రపతి అమలు చేయాల్సి వుంటుంది. సమాఖ్య విధానంలో వుండే ఒక ప్రాథమిక హక్కునే వమ్ముచేయడానికి ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తే సమాఖ్య విధానంలో ప్రాథమిక హక్కునే వమ్ము చేసే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ పాలకుల కుహనా జాతీయ హిందూత్వ భావజాలమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ప్రేరణగా వుంది. నిరంకుశ కేంద్రీకృత రాజ్యం కోసం అర్రులు చాస్తున్న భావజాలమిది. సమాఖ్య వ్యవస్థకూ వైవిధ్యానికీ, బహుళత్వానికి బద్ద విరుద్ధమైన భావజాలమిది.
ఈ వ్యూహాన్ని ఎండగట్టాలి
అధికార కేంద్రీకృత రాజ్యాన్ని రుద్దడంలో భాగంగానే మోడీ ప్రభుత్వం ఈ బిల్లులను ముందుకు తెచ్చింది. పద్దెనిమిదో లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, ఎన్‌డిఎ కూటమికి లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజార్టి లేకుండా పోయింది. రాజ్యసభలోనే అదే పరిస్థితి. రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఉభయ సభల్లోనూ హాజరై ఓటేసిన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మెజార్టీ ఉంటేనే ఆమోదం పొందగలుగుతుంది. అంతేగాక సభలో వున్న సభ్యుల్లో సగం మంది సవరణకు అనుకూలంగా ఓటేయాలి. ఆ విధమైన మెజార్టీ లేకుండానే బిల్ల్లులను సభలో ప్రవేశపెట్టి, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ఏదోవిధంగా చర్చలో పెట్టి రాజకీయ ప్రచారం చేసుకోవడం, భవిష్యత్తులో ఎప్పు డైనా అనుకూలమైన సమయం కలిసి వస్తుందేమో వేచి చూడటం లక్ష్యంగానే ఇది జరిగింది. ప్రజాస్వా మ్యానికి, సమాఖ్యతత్వానికి వ్యతిరేకమైన ఈ సవరణ బిల్లుల స్వభావాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రజల్లో ఎండగట్టడం అత్యావశ్యకం.
(డిసెంబర్ 18 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)